Saturday, November 15, 2025
Homeనేషనల్CENSUS 2026 : ఈసారి జనగణనలో కొత్త లెక్క.. మీ ఇంట్లో ల్యాప్‌టాప్, వైఫై ఉందా?

CENSUS 2026 : ఈసారి జనగణనలో కొత్త లెక్క.. మీ ఇంట్లో ల్యాప్‌టాప్, వైఫై ఉందా?

India Census 2026 new questions : సైకిల్ ఉందా? రేడియో ఉందా? – గతంలో జనగణన సిబ్బంది అడిగే ప్రశ్నలివి. కానీ, కాలం మారింది, దేశం మారింది, మన జీవనశైలీ మారింది. ఈ మార్పులను కచ్చితంగా అంచనా వేసేందుకు, రాబోయే జనగణన-2026లో కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రశ్నలతో మన ముందుకు రానుంది. “మీ ఇంట్లో ల్యాప్‌టాప్ ఉందా? స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? వైఫై కనెక్షన్ ఉందా…?” – వంటి ఆధునిక ప్రశ్నలతో, డిజిటల్ ఇండియా నాడిని పట్టుకోవాలని సంకల్పించింది. అసలు ఈ కొత్త ప్రశ్నల ఆంతర్యమేంటి? ఈ బృహత్తర కార్యక్రమం ఎప్పుడు, ఎలా జరగనుంది..?

- Advertisement -

ఎందుకీ కొత్త ప్రశ్నలు : ప్రస్తుతం ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు 2011-12 నాటి జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కానీ, గత 15 ఏళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు, అవసరాలు, మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఈ మార్పులను కచ్చితంగా నమోదు చేసి, భవిష్యత్ ప్రణాళికలకు శ్రీకారం చుట్టేందుకే, ఈసారి జనగణన ప్రశ్నావళిని ఆధునికీకరించారు.

ఏప్రిల్‌లో తొలి దశ.. కుటుంబ సర్వే : ఈ బృహత్తర కార్యక్రమం రెండు దశల్లో జరగనుంది. తొలి దశ ‘కుటుంబ సర్వే’ వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానుంది.

75 వేల మంది సిబ్బంది: తెలంగాణలో విద్య, వైద్యం, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన సుమారు 75 వేల మంది ఉద్యోగులు (ఎక్కువగా ఉపాధ్యాయులు) ఈ లెక్కింపులో పాల్గొంటారు.

ఏం లెక్కిస్తారు :  ఈ సర్వేలో, ప్రతి ఇంటి వివరాలతో పాటు, ఆ కుటుంబం వద్ద ఉన్న మౌలిక సదుపాయాలను సమగ్రంగా నమోదు చేస్తారు.

తొలి దశలో అడిగే కొన్ని ప్రశ్నలు: ఇంటి నిర్మాణం, గదుల సంఖ్య, తాగునీటి వసతి, మరుగుదొడ్డి సౌకర్యం. వంటకు ఉపయోగించే ఇంధనం.
వాహనాలు: సైకిల్, బైక్, కారు, ట్రాక్టర్ వంటివి ఉన్నాయా?
కొత్త ప్రశ్నలు: ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ, ఇంటర్నెట్ కనెక్షన్, వైఫై, ఓటీటీ సేవలు

అందుబాటులో ఉన్నాయా :  ఈ సర్వే ద్వారా, దేశంలో డిజిటల్ అక్షరాస్యత, సాంకేతిక పరికరాల లభ్యత ఏ స్థాయిలో ఉందో స్పష్టమైన గణాంకాలు లభిస్తాయి.

రెండో దశ.. 2027లో : 2027 ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండో దశ లెక్కింపు జరుగుతుంది. ఈ దశలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారాన్ని (వయసు, విద్య, ఉపాధి, కులం, మతం వంటివి) సేకరిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరగనుండటంతో, వివరాల నమోదు, విశ్లేషణ వేగవంతం, పారదర్శకం కానుంది. ఈ జనగణన ద్వారా లభించే సమగ్ర సమాచారం, రాబోయే దశాబ్ద కాలానికి దేశ ప్రగతికి, ప్రభుత్వ పథకాల రూపకల్పనకు దిక్సూచిగా నిలవనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad