Central Government given green signal for census survey: దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న జనగణన సర్వే జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన జరిపేందుకు రంగం సిద్ధమైంది. తొలి దశలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ చేపట్టనుంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుంది. తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు హౌసింగ్ సర్వే నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. సర్వే చేపట్టేందుకు ప్రతి రాష్ట్రానికి 30 రోజుల వ్యవధి ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇందుకు సంబంధించి తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. హౌస్ లిస్టింగ్ సర్వేలో భాగంగా అన్ని రకాల ఇళ్లు, నివాసాలు, భవనాలు, నిర్మాణాల వివరాలను సేకరించనున్నారు. కాగా, దేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2021లోనే ఈ జనగణన సర్వే నిర్వహించాల్సి ఉండగా.. కొవిడ్ కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా, ఈ ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. తొలి దశలో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నిర్వహించనుండగా.. రెండో దశలో 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందు పదిహేను రోజుల పాటు స్వీయ గణనకు ఆప్షన్ కూడా ఉంటుందని తెలిపింది.
డిజిటల్ విధానంలో జనగణన సర్వే..
మరోవైపు, జనాభా లెక్కల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ జనాభా లెక్కలు పూర్తిగా డిజిటల్ రూపంలో చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జనగణనతో పాటే కులగణనను సైతం చేపట్టాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో కులగణన ప్రక్రియను చేపట్టి, ఆ ప్రక్రియను సైతం పూర్తి చేసింది. కాగా, ఈ దఫా జనాభా లెక్కింపు అంతా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. మొబైల్ యాప్‌ల ద్వారా జనాభా లెక్కల సమాచారాన్ని సేకరించనున్నట్లు తెలిపింది. స్వీయ గణనకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు, జనగణనతో పాటే కుల గణనను కూడా చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. ‘హౌస్ లిస్టింగ్, గణన’ కోసం ఏప్రిల్ నుంచి దేశంలోని ప్రతీ ఇంటిని క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా చేరుకోవాలి? అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటి యజమానులను ఎలాంటి ప్రశ్నలు అడిగి, ఏ సమాచారం సేకరించాలి? మొబైల్ యాప్‌ను ఎలా వాడాలి? అనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్‌గా సమాచారాన్ని ఎంటర్ చేసే క్రమంలో పాటించాల్సిన భద్రతా ఫీచర్లు ఏంటి? సిబ్బందిని రాష్ట్ర, జిల్లా, ఉప జిల్లా స్థాయిల్లో ఎలా వినియోగించాలి? అధికారులు ఎలా సమన్వయం చేసుకోవాలి? అనే అంశాలపై స్పష్టమైన కార్యాచరణ, ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఇటీవలే ప్రీ టెస్ట్ ప్రక్రియను నిర్వహించారు. దాని ఆధారంగా జనగణన ప్రక్రియ నిర్వహిస్తారు. ఇక, జమ్ముకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో జనాభా లెక్కల ప్రక్రియను 2026 సెప్టెంబరు నుంచి అక్టోబరు 1 వరకు నిర్వహించనున్నారు.

