AI in School Curriculum: “ఇందు గలను అందు లేను అని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే కలను” అంటూ ఏఐ సర్వాంతర్యామిగా పరిణమిస్తున్న క్రమంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దాదాపు అన్ని రంగాల్లో ఏఐ రంగ ప్రవేశం చేసింది. దీంతో విద్యారంగంలో పెను మార్పులకు కేంద్ర ప్రభుత్వం స్వీకారం చుట్టనుంది. ఈ క్రమంలో 2026-27 విద్యా సంవత్సరంలో 3వ తరగతి నుంచే అన్ని పాఠశాలల కరిక్యులమ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ప్రవేశపెట్టాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయించింది.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇకనుంచి అన్ని తరగతుల విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్ ఫ్రేమ్ వర్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లుగా విద్యాశాఖ పేర్కొంది. వచ్చే రెండు మూడేళ్లలో విద్యార్థులు, టీచర్లు సమన్వయం చేసుకునేలా వేగంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా సుమారు కోటి మందికిపైగా టీచర్లకు ఏఐ టెక్నాలజీ విద్యపై దిశానిర్దేశం చేయడం సవాలుగా మారింది. అన్ని తరగతుల్లో ఏఐ ఏకీకరణకు సీబీఎస్‌ఈ ప్రేమ్ వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది. పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేయడానికి ఉపాధ్యాయులు ఏఐటూల్స్ ఉపయోగించేందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే చేపట్టినట్లు విద్యాశాఖ వెల్లడించింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా విద్యార్ధులను, ఉపాధ్యాయులను సిద్ధం చేయడమే మా లక్ష్యమని కేంద్ర స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు.
Also Read:https://teluguprabha.net/national-news/lalu-prasad-yadav-bihar-politics-mandir-mandal/
ఎనిమిది మిలియన్ల కొత్త ఉద్యోగాలు: ఇప్పటికే 18, 000 కి పైగా సీబీఎస్‌ఈ పాఠశాలలు 6వ తరగతి నుంచే 15 గంటల మాడ్యూల్‌లో ఏఐని స్కిల్ సబ్జెక్టుగా అందిస్తున్నాయి. ఇక 9 నుంచి 12 తరగతులు దీనిని ఐచ్ఛిక సబ్జెక్టుగా అందించనున్నట్లు తెలిపారు. ఏఐతో ఉద్యోగాల తొలగింపుపై ఎన్‌ఐటీఐ ఆయోగ్ నివేదికను విడుదల చేస్తూ సంజయ్ కుమార్ ఈ విషయాలను వెల్లడించారు. ఇది సుమారు 20 లక్షల సాంప్రదాయ ఉద్యోగాలను తొలగించవచ్చని అన్నారు. కానీ సరైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తే ఎనిమిది మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చని ఆయన తెలిపారు. ఏఐ ఆర్థిక వ్యవస్థలో భారత్ భవిష్యత్తు నిర్ణయాత్మక చర్యపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం, పరిశ్రమ, విద్యాసంస్థలలో సమన్వయ నాయకత్వంతో భారత్ తన శ్రామిక శక్తిని కాపాడుకోవడమే కాకుండా ప్రపంచ ఏఐని రూపొందించడంలో సైతం ముందుండగలదని ఈ నివేదిక పేర్కొంది.


