India Immigration Act 2025 : దేశ భద్రతను పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశీయులపై కఠిన వైఖరి అవలంబిస్తోంది. గతంలో నేరాలకు పాల్పడిన విదేశీ పౌరులు భారత్‌లోకి తిరిగి ప్రవేశించకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం 2025 ప్రకారం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ALSO READ: Ready to Release: ఈ వారం బాక్సాఫీస్ బరిలో నిలిచిన సినిమాలు ఇవే – ఘాటీకి పోటీ ఉంటుందా?
కీలక నిర్ణయాలు
నేర చరిత్రపై నిషేధం: గూఢచర్యం, ఉగ్రవాదం, హత్య, అత్యాచారం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన విదేశీయులను గుర్తించి, వారి రీఎంట్రీని నిషేధించాలి. అటువంటి వారు దేశంలో కనిపిస్తే, వెంటనే అదుపులోకి తీసుకోవాలి.
నిర్బంధ శిబిరాలు: ఇటీవల అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ చట్టం 2025 ప్రకారం, అక్రమ విదేశీయులను నిర్బంధించేందుకు ప్రత్యేక హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు ఆదేశం.
సరిహద్దు భద్రత: అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు సరిహద్దు రక్షణ దళాలు, కోస్ట్ గార్డ్ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన.
ప్రత్యేక ప్రాంతాల్లో నిషేధం: పాకిస్థాన్, చైనా, ఆఫ్ఘనిస్థాన్ దేశస్థులు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లోని సున్నిత ప్రాంతాల్లో ప్రవేశించకుండా నిషేధం.
విదేశీ ఉద్యోగులకు షరతులు: భారత్‌లో పనిచేసే విదేశీ ఉద్యోగులు విద్యుత్, నీరు, పెట్రోలియం వంటి కీలక రంగాల్లోని ప్రైవేటు సంస్థల్లో స్థానిక అధికారుల అనుమతి లేకుండా చేరకూడదు. పర్వతారోహణ వంటి కార్యక్రమాలకు కేంద్ర అనుమతి తప్పనిసరి.
లక్ష్యం: దేశ భద్రత
ఈ చర్యలు దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడటంతోపాటు అక్రమ కార్యకలాపాలను నిరోధించడం లక్ష్యంగా ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని హోంశాఖ ఆదేశించింది.


