Saturday, November 15, 2025
Homeనేషనల్Sonam Wangchuk: లఢక్ హీరో సోనమ్ వాంగ్‌చుక్‌పై కేంద్రం కన్నెర్ర.. ఎన్‌జీవో లైసెన్స్ రద్దు, సీబీఐ...

Sonam Wangchuk: లఢక్ హీరో సోనమ్ వాంగ్‌చుక్‌పై కేంద్రం కన్నెర్ర.. ఎన్‌జీవో లైసెన్స్ రద్దు, సీబీఐ విచారణ

Centre Cracks Down on Ladakh Activist Sonam Wangchuk: లఢక్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్లతో ఉద్యమానికి ముఖచిత్రంగా నిలిచిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆయన స్థాపించిన ‘స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లఢక్’ (SECMOL) స్వచ్ఛంద సంస్థకు విదేశీ నిధులు పొందేందుకు వీలు కల్పించే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) లైసెన్సును గురువారం సాయంత్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. దీంతో పాటు ఆయనకు చెందిన మరో సంస్థ ‘హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లఢక్’ (HIAL) ఆర్ధిక లావాదేవీలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తును ముమ్మరం చేసింది.

- Advertisement -

ALSO READ: Ladakh Explainer: ఆరేళ్ల సంబరం.. ఆగ్రహంగా ఎందుకు మారింది? లద్దాఖ్ ఆందోళనల వెనుక అసలు కథ!

లఢక్‌లో రాష్ట్ర హోదా ఉద్యమం హింసాత్మకంగా మారిన 24 గంటల్లోనే ఈ కీలక పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. బుధవారం జరిగిన ఘర్షణల్లో నలుగురు పౌరులు మరణించగా, 40 మంది పోలీసులతో సహా దాదాపు 80 మంది గాయపడ్డారు. ఈ హింసకు సోనమ్ వాంగ్‌చుక్ చేసిన ప్రేరేపిత ప్రసంగాలే కారణమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆయన మాటలతో రెచ్చిపోయిన ఆందోళనకారులు స్థానిక బీజేపీ కార్యాలయంపై, ఎన్నికల అధికారి కార్యాలయంపై దాడి చేశారని పేర్కొంది.

అసలేం జరిగిందంటే?

విదేశీ విరాళాల చట్టాన్ని పదేపదే ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలతో SECMOL లైసెన్సును రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 10న సంస్థకు షో-కాజ్ నోటీసు జారీ చేసినట్టు తెలిపింది. పాత బస్సు అమ్మగా వచ్చిన రూ. 3.35 లక్షలను FCRA ఖాతాలో జమ చేయడం, వాతావరణ మార్పులపై యువతలో అవగాహన కోసం స్వీడన్ నుంచి వచ్చిన రూ. 4.93 లక్షల విరాళం ‘దేశ ప్రయోజనాలకు విరుద్ధం’గా ఉందని ప్రభుత్వం తన నోటీసులో పేర్కొంది.

మరోవైపు, వాంగ్‌చుక్‌కు చెందిన HIAL సంస్థపై సీబీఐ రెండు నెలల క్రితమే విచారణ ప్రారంభించింది. FCRA లైసెన్స్ కోసం దరఖాస్తు చేయకముందే విదేశాల నుంచి సుమారు రూ. 1.5 కోట్లు సేకరించారని, నిధుల మళ్లింపు జరిగిందని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. HIAL మిగులు నిధుల నుంచి సుమారు రూ. 6.5 కోట్లను వాంగ్‌చుక్, మరో వ్యవస్థాపక సభ్యుడు డైరెక్టర్లుగా ఉన్న ‘శేష్యోన్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీకి మళ్లించారని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా, వాంగ్‌చుక్ ఈ ఏడాది ఫిబ్రవరి 6న పాకిస్థాన్‌కు వెళ్లిన పర్యటనను కూడా సీబీఐ సమీక్షిస్తోంది.

జైలుకు వెళ్లడానికైనా సిద్ధం: వాంగ్‌చుక్

ప్రభుత్వ చర్యలను ముందే ఊహించిన సోనమ్ వాంగ్‌చుక్, తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. “ప్రభుత్వం నాపై పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA) ప్రయోగించి, రెండేళ్ల పాటు జైల్లో పెట్టేందుకు కుట్ర పన్నుతోంది. నేను దానికి సిద్ధం. కానీ, బయట ఉన్న సోనమ్ వాంగ్‌చుక్ కంటే జైల్లో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్ ప్రభుత్వానికి ఎక్కువ సమస్యలు సృష్టించవచ్చు” అని ఆయన ఓ వార్తా సంస్థతో అన్నారు. లఢక్ ప్రజల హక్కుల కోసం తన పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

ALSO READ: Ladakh Protest: లద్దాఖ్‌లో భగ్గుమన్న ఆందోళనలు.. రాష్ట్ర హోదా పోరాటంలో నలుగురి మృతి, లేహ్‌లో కర్ఫ్యూ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad