IndiGo Crisis: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఇండిగో శీతాకాలపు షెడ్యూల్‌ను 5 శాతం తగ్గిస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఇండిగో రోజుకు దాదాపు 2,200 విమానాలను నడిపిస్తోంది. తాజా కోత ప్రకారం రోజుకి దాదాపు 110 విమాన సర్వీసులు తగ్గనున్నాయి. కోత విధించిన స్లాట్‌లను ఇతర విమానయాన సంస్థలకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
గత వారం రోజులుగా కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇండిగో కోసం ఆమోదించిన శీతాకాల షెడ్యూల్‌ను పరిశీలించినట్లు DGCA నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ మేరకు సోమవారం రాజ్యసభలో ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం కీలక ప్రకటన చేశారు. ఎయిర్‌లైన్స్‌పై ఆదర్శప్రాయమైన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తగా ప్రయాణీకుల భద్రతా నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత గత వారం రోజులుగా వందలాది విమానాలను రద్దు చేయడం ఇండిగో “అంతర్గత సంక్షోభం” ఫలితమేనని పేర్కొన్నారు.
పైలట్లు, సిబ్బంది, ప్రయాణీకుల పట్ల తాము శ్రద్ధ వహిస్తాముని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇదే విషయాన్ని అన్ని ఎయిర్‌లైన్స్‌కి స్పష్టం చేసినట్లు చెప్పారు. ఇండిగో సిబ్బంది, జాబితాను నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ఈ పరిస్థితిని తేలికగా తీసుకోవడం లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ మేరకు ఇండిగో శీతాకాలపు షెడ్యూల్‌ను 5 శాతం తగ్గించిన డీజీసీఏ.. అన్ని మార్గాల్లో ముఖ్యంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఈ స్లాట్‌లను ఇతర విమానయాన సంస్థలకు కేటాయిస్తామని పేర్కొంది. ఈ సవరించిన షెడ్యూల్‌ను బుధవారం సాయంత్రం 5 గం.ల లోపు తమకు అందించాలని ఇండిగోకి ఆదేశించినట్లు వెల్లడించింది.
Also Read: https://teluguprabha.net/national-news/pm-modi-sensational-comments-on-indigo-airlines-crisis/
కాగా, ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో అనేక రోజులుగా గందరగోళం, విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో DGCA ఈ పటిష్ఠమైన చర్యలు తీసుకుంది. వందలాది ఇండిగో విమానాలు రద్దు కావడంతో వివాహ ప్రణాళికలు, సెలవుల్లో అంతరాయాలతో పాటు ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ గందరగోళానికి ప్రధాన కారణం ప్రభుత్వం దాదాపు రెండేళ్ల క్రితం ప్రకటించిన కొత్త విమాన భద్రతా నియమాలు. విమాన ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా పైలట్ల అలసటను పరిష్కరించడంపై ఈ నియమాలు దృష్టి సారించాయి. దీని వలన డౌన్‌టైమ్(పైలట్ల విశ్రాంతి సమయం) పెరుగుతుంది.
ఈ కొత్త నిబంధనల అమలు కారణంగా విమానయాన సంస్థలు మరికొంతమంది పైలట్లను నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇండిగో ప్రతిరోజూ 2,200 విమానాలను పటిష్ఠంగా నడుపుతూ.. డౌన్‌టైమ్‌ను తగ్గించడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కొత్త నియమాలు అమలులోకి రావడంతో ఇండిగో సంస్థలో సిబ్బంది కొరత ఏర్పడింది. ఈ ఫలితంగా వందలాది విమానాలు రద్దులు కావడంతో ప్రయాణీకులకు కష్టకాలం ఎదురైంది. ఈ పరిస్థితి తీవ్రతరం కావడంతో డీజీసీఏ ఈ చర్యలను తీసుకుంది.

