Covid-19 : ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చైనా, జపాన్, అమెరికా సహా పలు దేశాల్లో గత కొద్ది రోజులుగా ఆందోళనకర స్థాయిలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా మహమ్మారి పరిస్థితులపై అంచనా వేయడానికి బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, జాతీయ టీకా సాంకేతిక సలహా బృందం చైర్మన్ ఆరోడా, ఐసీఎంఆర్ డీజీ డా.రాజీవ్ బహల్, ఇతర ఆరోగ్యశాఖ అధికారులు, ఆరోగ్య, ఆయుష్, ఔషద, బయోటెక్నాలజీ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని కేంద్రం ప్రజలకు సూచించంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. “COVID ఇంకా ముగిసిపోలేదు. అప్రమత్తంగా ఉండండి, నిఘాను మరింత పటిష్టం చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అని సమీక్షా అనంతరం కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌మాండవీయ ట్వీట్ చేశారు.
ప్రజలు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, తగినన్ని పరీక్షలు చేస్తున్నామని, రద్దీ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని కరోనా పై జాతీయ టాస్క్‌ఫోర్స్ అధిపతిగా ఉన్న వీకే పాల్ అన్నారు. అంతర్జాతీయ విమాన ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేవని చెప్పారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మన దేశంలో కరోనా అదుపులోనే ఉంది. 4వేలకు దిగువనే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ప్రపంచదేశాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టింది.