Google Ceo Sundar Pichai: భారత ప్రభుత్వం అందించిన ప్రతిష్టాత్మక పురస్కారం పద్మభూషణ్ అవార్డును గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అందుకున్నారు. అమెరికాలోని భారత రాయబారి తరణ్ జీత్ సింగ్ పద్మభూషణ్ అవార్డును పిచాయ్‌కు అందించారు. ఈ ఏడాది జనవరిలో పద్మ పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో పాటు సుందర్ పిచాయ్ కు కూడా పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు. తాజాగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆల్ఫాబెట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును పిచాయ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన భారత్ నుంచి ఈ గౌరవం పొదండం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భారత ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు నేను ఎంతగానో రుణపడి ఉంటానని సుందర్ పిచాయ్ తెలిపారు.
గూగుల్ , భారత్ మధ్య ఉన్న గొప్ప భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు తాను ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా విజన్ భారత్ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తుందని పిచాయ్ కొనియాడారు. భారత్‌లో గూగుల్ పెట్టుబడులు కొనసాగించడం గర్వంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. అయితే, శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన అవార్డు ప్రధాన కార్యక్రమంలో పిచాయ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, భారత కాన్సుల్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
గూగుల్ సీఈఓకు అవార్డు ప్రధానం అనంతరం.. అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధూ మాట్లాడారు..సుందర్ పిచాయ్‌కు పద్మ భూషణ్ అవార్డును అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.