Cloudburst in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో మరోసారి ఆకస్మిక వరదలు సంభవించాయి. చమోలీ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి కుంభవృష్టి కురిసింది. దీంతో పలు నివాసాలను వరద నీరు ముంచెత్తింది. వాహనాలు బురదలోనే కూరుకుపోయాయి. సగ్వారా గ్రామంలో ఓ యువతి శిథిలాల కింద కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. వరదల కారణంగా పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ సమాచారమందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఇళ్లల్లో చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ (Uttarakhand) సీఎం పుష్కర్‌సింగ్ ధామి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. స్థానిక అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థించారు.
Read Also: Delhi High Court: మళ్లీ సర్వీస్ ఛార్జీలా? ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
అంతేకాకుండా, రుద్రప్రయాగ్ నుంచి దాదాపు 50 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మింగ్ గధేరా సమీపంలో శిథిలాలు పేరుకుపోవడంతో కర్ణప్రయాగ్-గ్వాల్డామ్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. థరాలి-సాగ్వారా, డంగ్రి మోటార్ రోడ్లు కూడా మూసివేయబడ్డాయి. పలు ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు. ఉత్తరాఖండ్‌లో ఇటీవలే వరదలు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో ఉత్తర కాశీ అల్లకల్లోలమైంది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలీ గ్రామం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. అక్కడి ఇళ్లు, కార్లు, చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఆగస్టు మొదటివారంలో ఖీర్ గంగా నది పరీవాహక ప్రాంతంలో మేఘ విస్ఫోటంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద.. అతి వేగంగా ధరాలీ గ్రామంలోకి దూసుకొచ్చింది. దీంతో 3, 4 అంతస్తుల భవనాలూ పేకమేడల్లా కుప్పకూలి వరదలో కొట్టుకుపోయాయి.
Read Also: Trump: ఫర్నీచర్ దిగుమతులపైనా.. మరో 50 రోజుల్లో సుంకాలపై ట్రంప్ నిర్ణయం


