chhattisgarh bijapur encounter six maoists killed police recover weapons: గత కొంత కాలంగా వరుస ఎన్‌కౌంటర్లతో చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో తుపాకుల మోత మోగుతోంది. తాజాగా, చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ మేరకు ఘటనా స్థలంలో మావోయిస్టు మృతదేహాలు, ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ మీడియాకు వెల్లడించారు. బీజాపూర్ నేషనల్ పార్క్ ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనతో మరోసారి మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా టార్గెట్‌గా నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్‌లో ఈ భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నాయకులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) సిబ్బందితో కూడిన బృందం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది. కూంబింగ్ చేస్తుండగా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కనిపించడంతో ఇరువర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు మొదలయ్యాయి. కాల్పుల మోత పలు గంటల పాటు కొనసాగింది. భద్రతా బలగాలు ధీటుగా బదులివ్వడంతో మావోయిస్టులు వెనక్కి తగ్గారు. కాల్పులు తగ్గుముఖం పట్టిన తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులంతా సీనియర్ మావోయిస్టు కేడర్‌కు చెందినవారై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి ఒక INSAS రైఫిల్, స్టెన్ గన్స్, 0.303 రైఫిల్‌తో పాటు భారీగా ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు మరియు ఇతర సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా సిబ్బందిలో ఎవరికీ గాయాలు కాలేదని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ మీడియాకు వెల్లడించారు.
వెంటనే లొంగిపోండి.. లేదంటే కఠిన చర్యలు తప్పవు..
మావోయిస్టులు పారిపోయి ఉండవచ్చనే అనుమానంతో అదనపు డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ బృందాలు3 ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన ‘మావోయిస్టు రహిత భారత్-2026’ దిశగా ఈ ఆపరేషన్ ఒక కీలక ముందడుగు అని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఆపరేషన్ కగార్ ధాటికి మావోయిస్టులు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఎదుట లొంగిపోతున్నారు. అయితే, కొంతమంది మావోయిస్టులు మాత్రం ప్రభుత్వం చర్చకు పిలవాలని పట్టుబడుతున్నారు. వీరి విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఎదుట లొంగిపోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తోంది. వచ్చే ఏడాది మార్చిలోగా మావోయిస్టు రహిత దేశంగా మార్చాలనే సంకల్పంతో పనిచేస్తోంది.


