ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువ జర్నలిస్ట్, యూట్యూబర్ ముఖేష్ చంద్రకర్ ను కొందరు దారుణంగా చంపేశారు. జనవరి 1వ తేదీ రాత్రి నుంచి చంద్రకర్ కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు చెపుతున్నారు. అయితే తాజాగా బీజాపూర్ లోని కాంట్రాక్టర్ సురేష్ ఇంటి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్ లో ముఖేష్ శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముఖేష్ సోదరుడు.. యుకేష్ చంద్రకర్ ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ముఖేష్ మొబైల్ నంబర్‌ను ట్రాక్ చేసి కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్‌కు చెందిన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడే ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పరిశీలించగా ముఖేష్ మృతదేహం లభ్యమైంది. కాంట్రాక్టర్ సురేష్‌కు సంబంధించిన స్థలంలోనే ముఖేష్ చంద్రకర్ మృతదేహం లభ్యం కావడంతో అతడినే ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ముఖేష్ హత్యకేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు కాంట్రాక్టర్ సురేష్ ను హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు.
33 ఏళ్ల ముఖేష్ చంద్రకర్ ఎన్‌డిటివి సహా.. అనేక వార్తా ఛానెల్‌లకు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేశారు. 2021 ఏప్రిల్‌లో బీజాపూర్‌లోని తకల్‌గూడ నక్సల్స్ ఆకస్మిక దాడిలో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను మావోయిస్టుల చెర నుంచి విడిపించడంలో పాత్ర పోషించారు. బస్తర్ జంక్షన్ పేరిట ముఖేష్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌కు 1.59 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఇటీవల జిల్లాలో రోడ్డు నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని ఇచ్చిన నివేదిక వల్లే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాంట్రాక్టరే ముఖేష్ ను చంపాడని.. బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖేష్ హత్యకు కారణమైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని ఛత్తీస్‌గఢ్ లో జర్నలిస్టులు రాస్తారోకో చేశారు. అతనికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు ముఖేష్ హత్యను ఆ సీఎం విష్ణుదేవ్ సాయి తీవ్రంగా స్పందించారు. ముఖేష్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను వదలమన్నారు.