ఛత్తీస్‌గఢ్(Chhattigsarh)లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సుకుమా జిల్లాలోని కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతబలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతర పెట్టి పేల్చివేశారు. ఈ ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది జవాన్లు, ఒక డ్రైవర్ ఉన్నారు. క్షతగాత్రులను బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్‌లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత జవాన్లు వెళ్తున్న సమయంలో మావోయిస్టులు ఐఈడీని పేల్చారని అధికారులు తెలిపారు. భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందన్నారు.
కాగా గత కొన్నాళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య తరచూ కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. శనివారం అర్థరాత్రి ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.