Chhattisgarh Steel Jug Deal Controversy: మామూలుగా మనం వాడే స్టీల్ జగ్గు ధర ఎంత ఉంటుంది..? మహా అయితే కొన్ని వందలు. నాణ్యమైనదైతే వెయ్యి రూపాయలు దాటదు. కానీ, ప్రభుత్వ లెక్కల్లో అదే జగ్గు ధర ఏకంగా 32 వేల రూపాయలు పలికితే..? వినడానికే వింతగా, విడ్డూరంగా ఉంది కదా..! ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన హాస్టళ్ల కోసం తలపెట్టిన జగ్గుల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. గిరిజన విద్యార్థులు వాడే జగ్గుల కొనుగోలులో ఇంత భారీ అవినీతా? అంటూ ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అసలు ఈ 32 వేల జగ్గు కథేంటి..? ఇది నిజంగా జరిగిందా..? లేక ప్రతిపక్షాల ఆరోపణల్లో అతిశయోక్తి ఉందా..? ఈ వ్యవహారంపై అధికారుల వాదనేంటి.?
వివాదానికి దారితీసిన తీరు: ఛత్తీస్‌గఢ్‌లోని బలోదా బజార్ జిల్లాలో ఉన్న 160 గిరిజన హాస్టళ్ల కోసం వాటర్ జగ్గులు కొనుగోలు చేయాలని గిరిజన అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఈ కొనుగోలుకు సంబంధించి ఒక ప్రతిపాదిత పత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో అసలు వివాదం మొదలైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ పత్రాన్ని బయటపెట్టింది.
ఆ పత్రం ప్రకారం, హేమ్లాల్ కమార్ అనే కాంట్రాక్టర్‌తో ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉంది. మొత్తం 160 స్టీల్ జగ్గుల కోసం రూ. 51,99,920 చెల్లించేందుకు ప్రతిపాదించినట్లు ఆ పత్రంలో స్పష్టంగా ఉంది. అంటే ఒక్కో జగ్గు ధర సుమారు రూ. 32,500 అన్నమాట.
ఇవి జగ్గులా.. వరల్డ్ కప్పులా:
ఈ పత్రాన్ని ఆధారం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. “కేవలం ఒక స్టీల్ జగ్గు ధర రూ. 32 వేలు. 160 జగ్గులకు దాదాపు రూ. 52 లక్షల ప్రతిపాదన సిగ్గుచేటు. ఇవి స్టీల్ జగ్గులు మాత్రమే, వరల్డ్ కప్పులు కావు” అంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేసింది. ట్రైబల్ విద్యార్థుల డబ్బును కూడా వదిలిపెట్టకుండా అవినీతికి పాల్పడుతున్నారని, ఇది అత్యంత అసహ్యకరమైన ఉదాహరణ అని మండిపడింది. ఈ వ్యవహారంపై తక్షణమే ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.
అది రద్దయిన ప్రతిపాదన:
ప్రతిపక్షాల ఆరోపణలు తీవ్రరూపం దాల్చడంతో డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవోలప్మెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సూరజ్‌దాస్ మాణిక్‌పురి వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ ఆరోపణలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. “160 నీటి జగ్గుల కొనుగోలు కోసం అప్పటి అసిస్టెంట్ కమిషనర్ సంజయ్ కుర్రే, 2025 ఫిబ్రవరిలో ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (GeM) పోర్టల్‌లో ఒక ప్రతిపాదన పెట్టారు. అయితే, ధర చాలా అధికంగా ఉండటంతో, ఫిబ్రవరి 23వ తేదీనే ఆ ప్రతిపాదనను రద్దు చేయడం జరిగింది,” అని ఆయన స్పష్టం చేశారు.
ఆ తర్వాత ఎలాంటి కొనుగోలు ప్రక్రియా జరగలేదని, ఏ కాంట్రాక్టర్‌కు ఆర్డర్ ఇవ్వలేదని, ఎటువంటి చెల్లింపులు చేయలేదని ఆయన తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో చెక్కర్లు అవుతున్న సమాచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.


