CID raids Mamata Banerjee Residense : పశ్చిమ బంగాల్ రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిత్యం రాజకీయ ప్రత్యర్థులతో అమీతుమీ తేల్చుకునే తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇప్పుడు సొంత ఇలాకాలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉరుములేని పిడుగులా ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసు వ్యవహారం ఇప్పుడు ఏకంగా కాళీఘాట్‌లోని మమత నివాసానికి దర్యాప్తు సంస్థలను రప్పించేలా చేసింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) అధికారులు ఆకస్మికంగా దీదీ నివాసంలోకి ప్రవేశించి తనిఖీలు చేపట్టడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
విపక్ష హోదా కోసం.. ఫేక్ సంతకాల వివాదం : బంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత గుర్తింపును సాధించే క్రమంలో స్పీకర్‌కు సమర్పించిన ప్రతిపాదనల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేసి స్పీకర్‌కు సమర్పించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో సీఐడీ రంగంలోకి దిగింది. ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సంతకాలను వారికే తెలియకుండా ఫోర్జరీ చేయడం రాజ్యాంగపరంగా, చట్టపరంగా అత్యంత తీవ్రమైన నేరం. ఈ వ్యవహారంపై లోతైన విచారణ ప్రారంభించిన సీఐడీ.. క్రమంగా ఉచ్చు బిగిస్తూ పార్టీ అధిష్ఠానం వైపు అడుగులు వేస్తోంది.
అభిషేక్ ఇచ్చిన ఆ సమాచారమే కీలకం : ఈ కేసు దర్యాప్తులో భాగంగా టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సీఐడీ అధికారులు గతంలోనే విచారించారు. ఈ విచారణ సందర్భంగా అభిషేక్ కీలక సమాచారాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. కాళీఘాట్‌లోని ’30బీ హరీశ్ ఛటర్జీ వీధి’లో ఉన్న మమతా బెనర్జీ నివాసమే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర కార్యాలయంగా (Central Office) కూడా కొనసాగుతోంది. అయితే, ఎమ్మెల్యేల నుంచి సంతకాలు సేకరించిన ప్రక్రియ అంతా అక్కడే జరిగిందని విచారణలో అభిషేక్ బెనర్జీ అధికారులకు వివరణ ఇచ్చారు. సరిగ్గా ఈ స్టేట్‌మెంట్ ఆధారంగానే.. మంగళవారం ఉదయం సీఐడీ అధికారుల బృందం పక్కా ప్లాన్‌తో మమతా బెనర్జీ ఇంటికి చేరుకుని సోదాలు ప్రారంభించింది. ఫేక్ సంతకాలకు సంబంధించిన ముసాయిదా పత్రాలు, డిజిటల్ ఆధారాలు ఏమైనా లభిస్తాయా అన్న కోణంలో అణువణువూ గాలిస్తున్నారు.
దీదీ లేని వేళ.. కాళీఘాట్‌లో ఉద్రిక్తత : సీఐడీ ఎంట్రీతో కాళీఘాట్ ప్రాంతంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దాడులు జరిగే సమయానికి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ ఇద్దరూ ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశాల్లో పాల్గొనేందుకు దేశ రాజధాని దిల్లీలో ఉన్నారు. అధినేత్రి ఇంట్లో లేని సమయంలో ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా దర్యాప్తు సంస్థలు తనిఖీలకు రావడంపై తృణమూల్ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సీఐడీ అధికారులను అడ్డుకునేందుకు స్థానిక టీఎంసీ కార్యకర్తలు, నేతలు భారీగా అక్కడికి చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. అయితే, పరిస్థితి చెయ్యిదాటకుండా ఉండేందుకు ముందస్తుగానే భారీ పోలీసు బలగాలు మోహరించి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం దీదీ ఇంట్లో తనిఖీలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

