CJP representatives meet JP Nadda: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ‘చలో పార్లమెంట్’ తీవ్ర ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఆందోళనలను చల్లార్చేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఢిల్లీ నిరసనలకు నాయకత్వం వహించిన వ్యక్తులతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ మంత్రి జేపీ నడ్డాను కలిసి ఆయనకు వినతి పత్రం అందజేశారు. అందులో వారు మూడు డిమాండ్లను పేర్కొన్నారు. సోనమ్ వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లను పేర్కొన్నారు. వీటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వెనక్కి తగ్గేది లేదని, ఎన్ని నిర్భందాలు ఎదురైనా నిరసనలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. అయితే, వారి డిమాండ్లు విన్న అనంతరం కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని నడ్డా హామీ ఇచ్చారు. ఈ మేరకు భేటీ అనంతరం సీజేపీ ప్రతినిధులు ఎక్స్ వేదికగా తెలిపారు. నీట్‌తో పాటు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాల లీకేజీలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని, పేపర్ లీకేజీలకు కేంద్ర మంత్రే కారణమని సీజేపీ ఆరోపించింది. పేపర్ లీకేజీలపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించిందని ఆరోపించారు.
Also Read: Peeram Cheruvu: పీరం చెరువుపై అక్రమాల పంజా.. టౌన్ ప్లానింగ్ తీరు వివాదాస్పదం..!
ఆందోళనలు విరమించి, ప్రభుత్వానికి సహకరించాలి..
కాగా, సీజేపీ ప్రతినిధులతో ఇవాళ చర్చలు జరిపినట్లు కేంద్ర మంత్రి నడ్డా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. ‘‘ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇవాళ ఉదయం ఆందోళనకారుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఉదయం 11:50 గంటలకు మా చర్చలు ప్రారంభమయ్యాయి. తొలుత ఫేస్ టు ఫేస్ చర్చలు జరిపాం. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలో రాత పూర్వకంగా వినతిపత్రం సమర్పించారు” అని నడ్డా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సీజేపీ నిరసనకారులంతా వెంటనే తమ ఆందోళనలు విరమించి, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అటువైపు, ఢిల్లీ పోలీసులు సైతం ఆందోళకారులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు సమాచారం, సోషల్ మీడియాలో వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

