Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో కథువా జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. అధికారుల సమాచారం మేరకు కథువా జిల్లాలోని మారుమూల గ్రామంలో ఒక్కసారిగా కుండపోత వర్షం ప్రారంభమయ్యింది. ఈ భారీ వర్షానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. నదులు ఉప్పొంగి వరద బీభత్సం సృష్టించాయి.
భారీ వరదలతో రాజ్‌బాగ్ ప్రాంతంలోని ఘటీ గ్రామంలో నివాసాలు నేలమట్టం అయ్యాయి. వరద ప్రభావంతో రైల్వే ట్రాక్, జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. కథువా పోలీస్ స్టేషన్ నీట మునిగింది. కథువా పోలీస్ స్టేషన్ పరిధిలోని బగార్డ్, చాంగ్డా గ్రామాలు, లఖన్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దిల్వాన్, హుట్లీలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ఉజ్ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఇక్కడ నీటి మట్టం ఎక్కువగా పెరగడంతో స్థానికులని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.
Read more: https://teluguprabha.net/national-news/stray-dog-qr-code-gps-tracking-shimla-india/
కేంద్ర బలగాలు, స్థానిక సహాయక యంత్రాంగం చర్యలు చేపడుతూ మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన వారిని రక్షించి సమీప ఆసుపత్రికి తలరించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ సంఘటనపై వెంటనే స్పందించి, కథువా SSP శోభిత్ సక్సేనాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తూ, సహాయక చర్యలు సకాలంలో జరుగుతున్నాయని వెల్లడించారు.
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పరిస్థితిని వివరించినట్లు చెప్పారు. విపత్తును అదుపులోకి తెచ్చేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నాయని వెల్లడించారు.
Read more: https://teluguprabha.net/national-news/cp-radhakrishnan-nominated-by-bjp-as-vice-president/
కొద్దిరోజుల కిందటే చశోటి ప్రాంతంలో సంభవించిన క్లౌడ్ బర్స్ట్ లో పదుల సంఖ్యలో మృతి చెందగా.. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అది మరువకముందే ఈ ఘటన జరగటం బాధాకరం. పర్వత ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


