Wednesday, October 30, 2024
Homeనేషనల్CM Revanth met union minister Gadkari: ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా...

CM Revanth met union minister Gadkari: ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించండి

హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ ఆరు లైన్లుగా..

ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించాల‌ని, హైద‌రాబాద్-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిని ఆరు వ‌రుస‌లుగా విస్త‌రించాల‌ని జాతీయ ర‌హాదారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

- Advertisement -

ఈసంద‌ర్భంగా రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, నూత‌న జాతీయ ర‌హ‌దారుల ప్ర‌క‌ట‌న‌, ఇప్ప‌టికే జాతీయ ర‌హ‌దారులుగా ప్ర‌క‌టించిన మార్గాల ప‌నుల ప్రారంభం త‌దిత‌ర విష‌యాల‌ను కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు. సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌-తూప్రాన్‌-గ‌జ్వేల్‌-జ‌గ‌దేవ్‌పూర్‌-భువ‌న‌గిరి-చౌటుప్ప‌ల్ (158.645 కి.మీ.) ర‌హ‌దారిని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించార‌ని, దాని భూ సేక‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యంలో స‌గ భాగాన్ని త‌మ ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తోంద‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి వివ‌రించారు. ఈ భాగంలో త‌మ వంతు ప‌నులు వేగ‌వంతం చేశామ‌ని తెలిపారు. చౌటుప్ప‌ల్ నుంచి అమ‌న్‌గ‌ల్‌-షాద్‌న‌గ‌ర్‌-సంగారెడ్డి వ‌ర‌కు (181.87 కి.మీ.) ర‌హ‌దారిని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించాల‌ని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించి, ఈ ఏడాది ఎన్‌హెచ్ఏఐ వార్షిక ప్ర‌ణాళిక‌లో నిధులు మంజూరు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

హైద‌రాబాద్ (ఓఆర్ఆర్ గౌరెల్లి జంక్ష‌న్) నుంచి వ‌లిగొండ‌-తొర్రూర్-నెల్లికుదురు-మ‌హ‌బూబాబాద్‌-ఇల్లెందు- కొత్త‌గూడెం వ‌ర‌కు ర‌హ‌దారిని (ఎన్‌హెచ్‌-930పీ) జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించార‌ని, ఇందులో కేవ‌లం ఒక ప్యాకేజీ కింద 69 కి.మీ.ల‌కు టెండ‌ర్లు పిలిచి ప‌నులు ప్రారంభించార‌ని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు. హైద‌రాబాద్ వాసులు భ‌ద్రాచ‌లం వెళ్లేందుకు 40 కి.మీ. దూరం త‌గ్గించే ఈ ర‌హ‌దారిని జైశ్రీ‌రామ్ రోడ్‌గా వ‌రంగ‌ల్ స‌భ‌లో నితిన్ గ‌డ్క‌రీ చెప్పిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి గుర్తుచేశారు. ఈ ర‌హ‌దారిలో మిగిలిన మూడు ప్యాకేజీలకు (165 కి.మీ) టెండ‌ర్లు పిలిచినందున వెంట‌నే ప‌నులు ప్రారంభించాల‌ని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి వెంట ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, ఆర్అండ్ బీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు, పెద్ద‌ప‌ల్లి ఎంపీ వంశీ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు.

  • రెండు రాష్ట్రాల రాజ‌ధానుల మ‌ధ్య ర‌హ‌దారి ప‌నులు చేప‌ట్టాలి..
    హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ (ఎన్‌హెచ్ 65) జాతీయ ర‌హ‌దారిని 2024, ఏప్రిల్‌లోగా ఆరు వ‌రుస‌లుగా విస్త‌రించాలి ఉంద‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ దృష్టికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. రెండు రాష్ట్రాల రాజ‌ధానుల మ‌ధ్య కీల‌క‌మైన ఈ ర‌హ‌దారిలో రోజుకు 60 వేల‌కుపైగా వాహ‌నాలు రాక‌పోక‌లు సాగిస్తున్నాయ‌ని, వాహ‌నాల ర‌ద్దీతో ప్ర‌మాదాలు చోటు చేసుకొని ప‌లువురు ప్రాణాలు కోల్పోతున్నార‌ని ముఖ్య‌మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విప‌రీత‌మైన ర‌ద్దీ ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్ర విభ‌జ‌న‌తో వాహ‌న ర‌ద్దీ త‌గ్గింద‌ని, త‌మ‌కు స‌రైన ఆదాయం రావ‌డం లేదంటూ కాంట్రాక్ట్ సంస్థ ఆరు వ‌రుస‌ల ప‌నులు చేప‌ట్ట‌డం లేద‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి తెలియ‌జేశారు. ఎన్‌హెచ్ఏఐ, కాంట్రాక్ట్ సంస్థ మ‌ధ్య వివాదాన్ని ప‌రిష్క‌రించి త్వ‌ర‌గా ఆరు వ‌రుస‌లుగా ర‌హ‌దారి విస్త‌ర‌ణ చేప‌ట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.
  • ఐకానిక్ బ్రిడ్జి.. ఎలివేటెడ్ కారిడార్‌
  • క‌ల్వ‌కుర్తి నుంచి కొల్లాపూర్‌-సోమ‌శిల‌-క‌రివెన-నంద్యాల (ఎన్‌హెచ్‌-167కే) మార్గాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించి 142 కి.మీ. ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచి ప‌నులు ప్రారంభించార‌ని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. మిగిలిన 32 కి.మీ.ప‌నుల‌కు, ఐకానిక్ బ్రిడ్జికి టెండ‌ర్లు పిలిచార‌ని, ఆ ప‌నులు వెంట‌నే ప్రారంభించాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. ఈ ర‌హ‌దారి పూర్త‌యితే హైద‌రాబాద్ వాసుల‌కు తిరుప‌తికి 70 కిలోమీట‌ర్ల దూరం త‌గ్గుతుంద‌ని వివ‌రించారు. క‌ల్వ‌కుర్తి-నంద్యాల ర‌హ‌దారి (ఎన్‌హెచ్ -167కే) హైద‌రాబాద్‌-శ్రీ‌శైలం మార్గంలో ఉన్న ర‌హ‌దారిలో (ఎన్‌హెచ్ 765కే) 67 కిలోమీట‌ర్ వ‌ద్ద (క‌ల్వ‌కుర్తి) ప్రారంభ‌మ‌వుతుంద‌ని, ఎన్‌హెచ్ 167కే జాతీయ ర‌హ‌దారి ప‌నులు చేప‌ట్టినందున‌, హైద‌రాబాద్‌- క‌ల్వ‌కుర్తి వ‌ర‌కు ఉన్న (ఎన్‌హెచ్ 765కే) ర‌హ‌దారిని రెండు వ‌రుస‌ల నుంచి నాలుగు వ‌రుస‌లుగా విస్త‌రించాల‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. క‌ల్వ‌కుర్తి-క‌రివెన వ‌ర‌కు జాతీయ ర‌హ‌దారి పూర్తయ్యే లోపు హైద‌రాబాద్‌-క‌ల్వ‌కుర్తి ర‌హ‌దారిని నాలుగు వ‌రుసలుగా విస్త‌ర‌ణ‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరారు. హైద‌రాబాద్‌-శ్రీ‌శైలం (ఎన్‌హెచ్ 765) మార్గంలో 62 కిలోమీట‌ర్లు ఆమ్రాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వు ఫారెస్టు ప‌రిధిలో ఉంద‌ని, అట‌వీ అనుమ‌తులు లేక అక్క‌డ ప‌నులు చేప‌ట్ట‌లేద‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి తెలిపారు. ఈ మార్గంలో నిత్యం ఏడువేల‌కుపైగా వాహ‌న రాక‌పోక‌లు సాగిస్తాయ‌ని, ఈ నేపథ్యంలో ఆమ్రాబాద్ ప్రాంతంలో నాలుగు వ‌రుస‌ల ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కోరారు.
  • మంథ‌నికి జాతీయ ర‌హ‌దారి ప్ర‌క‌టించండి..
    మంథ‌ని నుంచి సీనియ‌ర్ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నార‌ని, మాజీ ప్ర‌ధాన‌మంత్రి పి.వి.న‌ర‌సింహారావు, మాజీ స‌భాప‌తి శ్రీ‌పాద‌రావు గ‌తంలో ప్రాతినిధ్యం వ‌హించార‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు జాతీయ ర‌హ‌దారుల చిత్రంలో మంథ‌నికి చోటు ద‌క్క‌లేద‌ని, జ‌గిత్యాల‌-పెద్ద‌ప‌ల్లి-మంథ‌ని-కాటారం రాష్ట్ర ర‌హ‌దారిని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించాల‌ని, త‌గిన నిధులు మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. ఈ ర‌హ‌దారి పూర్త‌యితే ఎన్‌హెచ్‌-565, ఎన్‌హెచ్‌-353సీ అనుసంధాన‌మ‌వుతాయ‌ని, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌జ‌ల‌కు అనువుగా ఉంటుంద‌ని, ద‌క్షిణ కాశీగా గుర్తింపుపొందిన కాళేశ్వ‌రం క్షేత్రానికి అనుసంధానత పెరుగుతుంద‌ని ముఖ్య‌మంత్రి కేంద్ర మంత్రికి వివ‌రించారు.
  • ముఖ్య‌మంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఇత‌ర అంశాలు…
  • తెలంగాణ‌ను క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రను అనుసంధానించే హైద‌రాబాద్‌-మ‌న్నెగూడ నాలుగు వ‌రుస‌ల జాతీయ ర‌హ‌దారిగా (ఎన్‌హెచ్‌-163) ప్ర‌క‌టించ‌డంతో భూ సేక‌ర‌ణ పూర్తి చేశాం. టెండ‌ర్లు పిల‌వ‌డం పూర్త‌యిన ఎన్జీటీలో కేసు వ‌ల‌న ప‌నులు ప్రారంభం కాలేదు. ఆ మార్గంలో ఉన్న మ‌ర్రి చెట్ల‌ను కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం ట్రాన్స్‌లోకేష‌న్ చేసేందుకు ఎన్‌హెచ్ ఏఐ అంగీక‌రించింది. ఈ ద‌శ‌లో ఎలైన్‌మెంట్ మార్చ‌డం సాధ్యం కాదు. సంబంధిత శాఖ‌ల‌కు త‌గిన ఆదేశాలు జారీ చేసి ఈ మార్గం ప‌నులు వెంట‌నే ప్రారంభించాలి.
  • సేతు బంధ‌న్ స్కీం కింద 2023-24లో రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మ‌ర్పించిన 12 ఆర్వోబీలు/ఆర్‌యూబీలను వెంట‌నే మంజూరు చేయాలి.
  • జ‌గిత్యాల‌-కాటారం (130 కి.మీ.), దిండి-న‌ల్గొండ (100 కి.మీ.), భువ‌న‌గిరి-చిట్యాల (44 కి.మీ), చౌటుప్ప‌ల్-సంగారెడ్డి (182 కి.మీ), మ‌రిక‌ల్‌-రామ‌స‌ముద్రం (63 కి.మీ.), వ‌న‌ప‌ర్తి-మంత్రాల‌యం (110 కి.మీ.), మ‌న్నెగూడ‌-బీద‌ర్ (134 కి.మీ.), క‌రీంన‌గ‌ర్‌-పిట్లం (165 కి.మీ.), ఎర్ర‌వెల్లి క్రాస్ రోడ్‌-రాయ‌చూర్ (67 కి.మీ.), కొత్త‌ప‌ల్లి-దుద్దెడ (75 కి.మీ.), సార‌పాక‌-ఏటూరు నాగారం (93 కి.మీ.), దుద్దెడ‌-రాయ‌గిరి క్రాస్ రోడ్ (63 కి.మీ.), జ‌గ్గ‌య్య‌పేట‌-కొత్త‌గూడెం (100 కి.మీ.), సిరిసిల్ల‌-కోర‌ట్ల (65 కి.మీ.), భూత్పూర్‌-సిరిగిరిపాడు (166 కి.మీ.), క‌రీంన‌గ‌ర్-రాయ‌ప‌ట్నం (60 కి.మీ.) మొత్తం 1617 కి.మీ.జాతీయ ర‌హ‌దారుల‌ను అప్‌గ్రేడ్ చేయాలి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News