CM Stalin: టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ప్రచార సభలో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరూర్‌లో జరిగిన ఈ విషాదంలో 39 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.
తొక్కిసలాట జరిగిన అనంతరం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను స్వయంగా పరామర్శించిన అనంతరం సీఎం స్టాలిన్ విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
మృతులకు రూ.10 లక్షలు పరిహారం
ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 39 మంది మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.10 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 51 మంది గాయపడినవారికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.
ఈ ఘటన వెనుక నిజానిజాలు, బాధ్యులెవరు అనే అంశాలను తేల్చేందుకు, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించినట్లు స్టాలిన్ వెల్లడించారు. ఈ కమిషన్ విచారణ నివేదిక అనంతరం, రాజకీయ ఉద్దేశాలు లేకుండా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


