CM Vijay’s sensational decision: ఇటీవల తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి విజయ్ చాలా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు గుడులు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 మద్యం షాపులను రాబోయే రెండు వారాల్లో పూర్తిగా మూసివేయనున్నారు. ఇందులో ప్రార్థనా స్థలాల దగ్గర ఉన్న 276 షాపులు, విద్యాసంస్థల సమీపంలోని 186 షాపులు, బస్ టెర్మినల్స్ దగ్గరి 255 షాపులున్నట్లు గుర్తించారు. ఈ నిర్ణయంతో తమిళనాడులోని మొత్తం మద్యం దుకాణాల సంఖ్య 4,765 నుండి 4,048కి తగ్గనుంది. మహిళా భద్రతే లక్ష్యంగా విజయ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక, రాష్ట్రంలో మద్యపాన వయస్సు ప్రస్తుతం 21 సంవత్సరాలుగా ఉండగా.. దీనిని క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/uber-representatives-meet-ap-cm/
21 ఏళ్లలోపు వారికి లిక్కర్ అమ్మవద్దు..
మద్యం కొనుగోలు చేయడానికి వచ్చే కస్టమర్ల వయస్సుపై అనుమానం వస్తే గుర్తింపు కార్డులను తనిఖీ చేయాలని తెలిపింది. 21 ఏళ్ల లోపు వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ మద్యం విక్రయించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం తమిళనాడులో మద్యం దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచే ఉంటున్నాయి. ఈ సమయాన్ని రాత్రి 8 గంటల వరకు మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది. రాష్ట్రానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయం (2025లో రూ. 48,344 కోట్లు) భారీగా ఉన్నప్పటికీ, రాబడి కన్నా ప్రజా సంక్షేమమే ముఖ్యమనే కోణంలో సీఎం విజయ్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

