CNG prices hike in Hyderabad: ఇటీవల పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు పెంచిన కేంద్రం వాహనదారులకు మరో బిగ్ షాకిచ్చింది. కిలో సీఎన్‌జీపై మరోసారి రూ.1 పెంచుతూ ఆదివారం ప్రకటన చేసింది. కాగా, రెండ్రోజుల క్రితమే కిలో సీఎన్‌జీపై రూ.2 పెంచిన కేంద్రం.. వెంటనే మళ్లీ ధరను పెంచడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా, రెండు రోజుల క్రితమే పెట్రో ధరల పెంపు సందర్బంగా సీఎన్‌జీ కూడా రూ.2 పెంచిన సంగతి తెలిసిందే. ఇలా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే సీఎన్‌జీ ధరను రెండుసార్లు పెంచడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా పెంపుతో సీఎన్‌జీపై మొత్తంగా మూడు రూపాయాలను పెంచినట్టు అయ్యింది. తాజాగా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.80.09కి చేరింది. ముంబైలో రూ. 84.09కి చేరింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో రూ. 88.70కి పెరిగింది. ఇక, హైదరాబాద్‌లో రూ.100కు చేరుకుంది.
Also read: Rains in AP: ఏపీలో భిన్నమైన వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షం..!
హైదరాబాద్లో సెంచరీ తాకిన సీఎన్జీ..
ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోయి హైదరాబాద్ నగరంలో సీఎన్‌జీ గ్యాస్ కొరత 6 నెలల నుంచి తీవ్రంగా వేధిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఆటో డ్రైవర్లు, ఇతర వాహనదారులు సీఎన్ మేలని భావిస్తే.. ఇప్పుడు ఈ ధర కూడా సెంచరీకి చేరుకుంది. పెట్రోల్,డీజిల్‌తో పోలిస్తే సీఎన్‌జీ అధిక మైలేజీతో పాటు కాలుష్య రహితం కావడంతో చాలా మంది వాహనాలను సీఎన్‌జీకి అనుగుణంగా ఇంధన ట్యాంకులను మార్చుకున్నారు. మరోవైపు, సీఎన్జీ ఇంధన కొరతతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ రద్దీ కొనసాగుతోంది. దీంతో ఆటో డ్రైవర్లు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇంధన కొరత సమస్యను పరిష్కరించాలని, ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

