పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టే కాంగ్రెస్ పార్టీ మరోమారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ జీరోస్ సాధించిందని చర్చించుకునే పరిస్థితి తలెత్తింది.
2013 తరువాత కోలుకోలేక
కౌంటింగ్ మొదలైనప్పటి నుంచీ ఒకే ఒక స్థానమైన బద్లీలో లీడింగ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత ఇక్కడ కూడా వెనుకంజలోకి వెళ్లిపోవటంతో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఘోరంగా ఓటమిపాలయ్యారు. 2013 వరకు 15 ఏళ్లపాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఆ తరువాతి రోజుల్లో ఇలా ఘోరపరాజయంపాలవుతూ పరువు కాపాడుకునే పోరాటానికే పరిమితం కావాల్సి వచ్చింది. మూడుసార్లు హ్యాట్రిక్ ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ రాజధానిలో కాంగ్రెస్ పార్టీని నడిపించగా ఆతరువాత ఆప్ చేతిలో ఓటమిపాలై కోలుకోలేని దెబ్బతినింది.
అంతర్గత కుమ్ములాటలు
ఓవైపు కాంగ్రెస్ పార్టీలో ఎడతెగని అంతర్గత కుమ్ములాటలు, మరోవైపు కాంగ్రెస్ పెద్దలకు ఢిల్లీ కాంగ్రెస్ పై పట్టు, ఆసక్తి లేకపోవటంతో పార్టీ చతికిలపడింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పలు ర్యాలీల్లో పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించినా కాంగ్రెస్ ఇక్కడ కోలుకోలేకపోవటం విశేషం.