Friday, November 22, 2024
Homeనేషనల్Congress stand is the same on Somnath-Ayodhya: కాంగ్రెస్‌ పార్టీ తప్పటడుగు వేసిందా?

Congress stand is the same on Somnath-Ayodhya: కాంగ్రెస్‌ పార్టీ తప్పటడుగు వేసిందా?

నాటి సోమనాథ్ మందిరం నేటి అయోధ్య మందిరాలపై కాంగ్రెస్ వ్యవహార శైలిలో మార్పు లేదు

అసలే వరుస పరాజయాలతో దెబ్బతిని ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల వేళ అది ఒక జాతీయ పార్టీగా కాక, ఒక ప్రాంతీయ పార్టీగా ఆలోచించడం, వ్యవహరించడం జరుగుతోందనే భావన ఆ పార్టీలోనూ వ్యక్తమవుతోంది. అయోధ్యలో ఈ నెల 22 జరిగే రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ తమకు అందిన ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ పార్టీ తిరస్కరించడం ఆ పార్టీ కుహానా లౌకికవాద ధోరణికి పరా కాష్ఠగా చెప్పుకోవచ్చు. ఈ కుహానా లౌకికవాద ధోరణి ఈ పార్టీలో జవహర్‌ లాల్‌ నెహ్రూ హయాం నుంచి కొనసాగుతోంది. పాతికేళ్ల క్రితం సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేత పట్టినప్పటి నుంచి ఈ కుహానా లౌకికవాదం క్రమంగా హిందూ వ్యతిరేకతగా మారిపోయింది. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాకపోవడ మన్నది కాంగ్రెస్‌ చారిత్రాత్మక తప్పిదం. ఇటువంటి తప్పటడుగు కాంగ్రెస్‌ వేయడం ఏమాత్రం భావ్యం కాదని ఆ పార్టీలోని పెద్దలే చెబుతున్నారు. ఇది రామ మందిర నిర్మాణ వ్యవహారమే కాదు. దేశ నాగరికతను పునురుద్ధరించడం, పునర్మించడం కూడా అవుతుంది. ఏది ఏమైనా ఇందుకు సంబంధించిన ఆహ్వానాన్ని నూట ఇరవై అయిదేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ తిరస్కరించడం వింతల్లో కెల్లా వింతగా కనిపిస్తోంది.

- Advertisement -


ఇస్లామిక్‌ దాడులు, ఆక్రమణల కారణంగానూ, ఆ తర్వాత వలస పాలకుల కారణంగానూ దాదాపు వెయ్యి సంవత్సరాలుగా అణచివేతకు గురైన భారత నాగరికత తిరిగి తనను తాను వ్యక్తం చేసుకుంటున్న వేళ కాంగ్రెస్‌ దీన్ని మతపరమైన వ్యవహారంగానూ, రాజకీయ వ్యవహారంగానూ పరిగణించి తప్పుడు అభిప్రాయాలతో తప్పుడు నిర్ణయం తీసుకోవడం ఈ పార్టీ భవితవ్యానికి తీరని దెబ్బ అనే చెప్పాల్సి ఉంటుంది. నిజానికి, రాజకీయ కారణాలతో లేదా ఎన్నికల కారణాలతో చూసినా కాంగ్రెస్‌ తప్పటడుగు వేసిందనే చెప్పవచ్చు. ఈ దేశంలో 110 కోట్ల మంది హిం దువులున్న విషయాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ విస్మరించలేనిది. ఈ హిందువులు తమను తాము వ్యక్తం చేసుకోవడానికి, సంఘటితం కావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏ విధంగానూ ఎవరికీ వ్యతిరేకమైనవి కావు. ఇక ఫెడరల్‌ వ్యవస్థలో, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఈ రకమైన పరిణామాలు సహజమైనవి. ఇక్కడ అత్యధిక సంఖ్యాక ప్రజల మనోభీష్టాన్ని ఏ పార్టీ అయినా గౌరవించాల్సిందేనన్న విషయం కాంగ్రెస్‌ పెద్దలకు ఎందుకు తోచలేదో అర్థంకావడం లేదు.
అంతర్మథనం అవసరం అంతకన్నా విచిత్రమైన విషయమేమిటంటే, అత్యధిక సంఖ్యాక ప్రజల మనోభీష్టాన్ని గౌరవించనందువల్లే కాంగ్రెస్‌ 2014, 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ జాతీయ స్థాయి ఓట్ల శాతం 20 శాతానికి పైగా పడిపోయింది. పార్లమెంటులో కూడా దీని సీట్ల శాతం పదికి పడిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ హిందూ మతద్వేషి అనే విషయం స్వాతంత్య్రం తర్వాత నుంచి అనేక సందర్భాలలో బయటపడుతూ వచ్చింది. గుజరాత్‌లోని సోమనాథ మందిరాన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు జవహర్‌ లాల్‌ నెహ్రూ నిర్మొహమాటంగా, నిష్కర్షగా రాజేంద్ర ప్రసాద్‌, వల్లభాయ్‌ పటేల్‌, కె.ఎం. మున్షీల ప్రయత్నాలను తిరస్కరించడం జరిగింది. సోమనాథ్‌ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రాజేంద్ర ప్రసాద్‌ వెళ్లదలచుకున్నప్పుడు నెహ్రూ అందుకు అంగీకరించలేదు. ఇది కాంగ్రెస్‌ పార్టీ లౌకికవాద విధానాలకు పూర్తి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. అయితే, అనేక పర్యాయాలు ఇస్లామిక్‌ రాజుల విధ్వంసకాండలకు గురైన ఈ మందిరాన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని సర్దార్‌ పటేల్‌ ఒక సవాలుగా తీసుకున్నారు. నెహ్రూ అభ్యంతర పెడుతున్నా లెక్క చేయకుండా రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌, వల్లభాయ్‌ పటేల్‌లు ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
సోమనాథ మందిర వ్యవహారంతో దేశంలో కాంగ్రెస్‌ పార్టీ కుహానా లౌకికవాద స్వరూపం క్రమంగా వెల్లడి కావడం ప్రారంభమైంది. ఇది పార్టీలోని పలువురికి ఏమాత్రం నచ్చేది కాకపోయినా సహించడం, భరించడం జరుగుతుండేది. నెహ్రూ అన్ని మతాల పట్ల సమాన భావంతో వ్యవహరించడం లేదనే పార్టీలోని అత్యధిక సంఖ్యాకుల అభిప్రాయంగా ఉండేది. ‘సోమనాథ మందిరానికి సంబంధించినంత వరకు దేశంలోని హిందువుల అభిప్రాయాలు, ఆకాంక్షలు సానుకూలంగా ఉన్న స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ ఆలయాన్ని పునరుద్ధరించడం అనేది ప్రతిష్టాకర విషయం. అత్యధిక సంఖ్యాక హిందువుల మనోభావాలను గౌరవించడం ప్రభుత్వ కర్తవ్యం అని పటేల్‌ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే, విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలోనే పటేల్‌ 1950 డిసెంబర్‌ 15న కన్నుమూయడం జరిగింది. పటేల్‌ కాలధర్మం చెందిన తర్వాత హిందువుల విషయంలో నెహ్రూ ధోరణి మరింతగా బలపడింది.

కాలం చెల్లిన భావాలు సోమనాథ మందిరం మీద ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడానికి నెహ్రూ ససేమిరా ఒప్పుకోలేదని ఆ తర్వాత అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వి.ఎన్‌. గాడ్గిల్‌ తన గవర్నమెంట్‌ ఫ్రమ్‌ ఇన్సైడ్‌ అనే పుస్తకంలో రాశారు. “ఈ విగ్రహ ప్రతిష్ఠాపన, ఆలయ పునరుద్ధరణ కార్యక్రమానికి రాష్ట్రపతి వెళ్లడం కూడా ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. దేశంలోని అనేక మసీ దులు, చర్చిల పునరుద్ధరణకు విపరీతంగా ఖర్చుపెడుతున్న ప్రభుత్వం ఈ దేవాలయానికి కొద్దిపాటి నిధులు కేటాయించడంలో తప్పు లేదు. లౌకికవాదమంటే దేశంలోని అన్ని మతాలనూ సమదృష్టితో చూడడం అని మేమంతా ఆయనకు నచ్చజెప్పాం. అయితే, ఆయన మాటలు వినలేదు. హిందూ మతం పట్ల నమ్మకం ఉండడాన్ని ఆయన తీవ్రంగా గర్హించేవారు అని గాడ్గిల్‌ రాశారు.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, నెహ్రూ మరో మంత్రి కె.ఎం. మున్షీని మంత్రివర్గ సమావేశంలోనే చెడామడా తిట్టేశారు. ‘మీరు సోమనాథ దేవాలయం కోసం ప్రయత్నించడం నాకే మాత్రం ఇష్టం లేదు. హిందూ మత పునరుజ్జీవనానికి నేను వ్యతిరేకిని’ అని నెహ్రూ ఈ సమావేశంలో మున్షీతో అన్నారు. సమావేశం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మున్షీ ప్రధానికి ఒక పెద్ద లేఖ రాశారు. అయోధ్య వివాదం నేపథ్యంలో ఆ లేఖ ఇప్పటికీ ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ‘సోమనాథ దేవాలయాన్ని పునరుద్ధరించాలని దేశంలోని ప్రతి హిందువూ కోరుకుంటున్నారు. ఇతర మతాలవారికి సహాయం చేస్తున్నట్టే హిందువులకు సహాయం చేయడంలో ఏమాత్రం తప్పు లేదు’ అని ఆయన లేఖ రాశారు. తాను హిందూ పునరుజ్జీవనానికి చేయూతనందిస్తున్నానంటూ నెహ్రూ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందిస్తూ. ‘హిందువుల సంక్షేమానికి నా వంతుగా నేను సేవలు అందిస్తున్నాను. ఈ ఆధునిక పరిస్థితుల్లోనూ దేశం శక్తిమంతంగా ఉండాలన్న పక్షంలో మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. దేశ భవిష్యత్తుకు భారతీయ నాగరికత ఒక బలమైన పునాదిలాంటిది’ అని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, ఆయన ‘ఈ దేశ ప్రజల నమ్మకాలను తుత్తునియలు చేయాలనుకున్న వారి కోసం పనిచేయడం దేశ స్వాతంత్య్రంలో భాగం కాదు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడం స్వాతంత్య్రమూ కాదు, లౌకిక వాదమూ కాదు. మీకు ఇష్టమున్నా లేకపోయినా కోట్లాది మంది హిందువులకు సోమనాథ దేవాలయ పునరుద్ధరణ చాలా ఇష్టమైన విషయం. అది అద్భుతంగా పూర్తయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ విషయంలో ప్రజల కల సాకారం అయింది. ఈ ఆలయ పునరుద్ధరణతో మన బలం పెరుగుతుంది. మన నాగరికత తనను ఆవిష్కరించుకున్నట్టవుతుంది’ అని మున్షీ తన లేఖలో పేర్కొన్నారు. ఇక్కడ సోమనాథ దేవాలయం బదులు అయోధ్య అని రాసుకుంటే సరిపోతుంది.
నాయకత్వానికి కొరత దురదృష్టవశాత్తూ, ఇన్ని దశాబ్దాలు గడిచినా, దేశకాల పరిస్థితులు పూర్తిగా మారిపోయినా కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈ కుహానా లౌకికవాద ధోరణి నుంచి ఇప్పటికీ బయటపడడం లేదు. ఆ పార్టీలోని హిందూ వ్యతిరేక భావజాలం రోజు రోజుకూ ముదిరిపోతోంది. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మత హింస నిరోధక చట్టం ఇందుకు మరో చక్కని ఉదాహరణ. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ నేతృత్వంలోని జాతీయ సలహా మండలి ఆధ్వర్యంలో ఈ బిల్లు ముసాయిదా రూపుదిద్దుకుంది. ఈ బిల్లు ప్రకారం, ఎప్పుడు ఎక్కడ మత ఘర్షణలు చెలరేగినా అల్పసంఖ్యాక వర్గాలు బాధితులవుతారు. అత్యధిక సంఖ్యాక మతం వారు నిందితులవుతారు. ఈ చట్టం ప్రకారం వ్యవహరించిన పోలీసులు, అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తోంది. భారతదేశ సైనిక దళాలలో మతపరమైన జనాభా లెక్కలను గణించాలని కోరే సచార్‌ కమిటీ నివేదిక, విశ్వవిద్యాలయాల్లో కూడా మతపరమైన కోటాలు నిర్ణయించాలని సూచించిన రంగనాథ్‌ మిశ్రా నివేదిక అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాల హిందూ వ్యతిరేకతకు ప్రబల ఉదాహరణలు.
నెహ్రూ కాలంలో దేశంలో బలమైన హిందూ పార్టీ ఏమీ లేదు. నరేంద్ర మోదీ వంటి శక్తిమంతుడైన హిందూ నాయకుడు కూడా లేడు. అందువల్ల కాంగ్రెస్‌ పార్టీ ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా ఉండేది. అందువల్లే సోమనాథ మందిరం విషయంలో నెహ్రూ మాటకు, కాంగ్రెస్‌ వైఖరికి ఎదురు లేకుండా తయారైంది. ఆ ఆలయాన్ని ప్రజల సొమ్ముతో కట్టడం జరిగింది. ఇప్పుడు ఆ కథ మారిపోయింది. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత కాంగ్రెస్‌ పరిస్థితి ఏమిటన్నది ఆ పార్టీలోని వారికే రకరకాలుగా అనుమానాలు, సందేహాలు కలిగిస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని నాగరికత పునరుజ్జీవనంగా, పునరుద్ధరణగా భావిస్తున్న అత్యధిక సంఖ్యాక హిందువుల మనోభావాలను దెబ్బతీసిన పార్టీగా కాంగ్రెస్‌ మరోసారి దేశ చరిత్రలో నిలిచిపోతుంది.

  • ఎస్‌. వేణుగోపాల్‌
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News