Ram Mandir Donation Theft Allegations : కోట్లాది మంది భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు, భావోద్వేగాలకు నిలయమైన అయోధ్య రామమందిర నిర్మాణం చుట్టూ ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి సేకరించిన విరాళాల విక్రయం, చోరీ వ్యవహారంలో అధికార బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘కమలం’ పార్టీలో ఉన్నవారంతా చందా దొంగలు కాకపోవచ్చు కానీ, ఎక్కువ మంది మాత్రం ఆ అధికార పార్టీలోనే ఉన్నారంటూ సీనియర్ కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నిధుల దుర్వినియోగం కేవలం నిన్నమొన్నటిది కాదని, ఏకంగా శిలా పూజ సమయం నుంచే మొదలైందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నిప్పులు చెరిగింది.
‘శిలా పూజ’ నుంచే విరాళాల దారిమల్లింపు: అయోధ్య రామమందిరానికి సేకరించిన విరాళాలు, భక్తులు సమర్పించిన విలువైన కానుకల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రమోద్ తివారీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆలయ నిర్మాణ ఉద్యమం ప్రారంభమైన తొలి రోజుల్లోనే నిధుల పక్కదారి పట్టించే ప్రక్రియకు పునాది పడిందని ఆయన పేర్కొన్నారు. విరాళాల చోరీ అనేది ఒక క్రమబద్ధమైన వ్యవస్థగా మారిందని, శతాబ్దాల నాటి కల నెరవేరుతున్న వేళ కోట్లాది మంది రామభక్తులు సమర్పించిన స్వచ్ఛమైన కానుకలను సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ముసుగు వేయాలని చూస్తోందని, కానీ ఇది 140 కోట్ల భారతీయుల నమ్మకానికి సంబంధించిన అంశమని ఆయన స్పష్టం చేశారు.
‘రామమందిరం కట్టింది సుప్రీంకోర్టు.. బీజేపీ కాదు’ : రామమందిర నిర్మాణ క్రమాన్ని గుర్తుచేస్తూ ప్రమోద్ తివారీ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రామమందిర ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న సమయంలో ‘మందిర్ వహీం బనాయేంగే’ అని నినాదాలు చేసిన బీజేపీ, అధికారంలోకి వచ్చాక కాలయాపన చేసిందని ఆరోపించారు. కోర్టు తీర్పుతోనే సాధ్యం: అయోధ్యలో ఆలయ నిర్మాణం జరిగింది సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఫలితంగానే తప్ప, బీజేపీ చొరవతో కాదని వ్యాఖ్యానించారు.
అసంపూర్తి ప్రతిష్ఠాపన: లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం నిర్మాణం పూర్తికాకుండానే ప్రధాని మోదీ ‘ప్రాణప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని నిర్వహించారని విమర్శించారు. శంకరాచార్యుల పర్యవేక్షణలో జరగాల్సిన పవిత్ర కార్యాన్ని ఎన్నికల అజెండాగా మార్చేశారని ధ్వజమెత్తారు.
ప్రధాని మోదీ, చంపత్ రాయ్‌లపై విమర్శల బాణాలు : రామమందిర నిర్మాణానికి సంబంధించిన ఘనతనంతా ప్రధాని నరేంద్ర మోదీ తన ఖాతాలో వేసుకున్నప్పుడు, అక్కడ జరిగిన అక్రమాలు, పొరపాట్లకు కూడా ఆయనే బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుల నియామకం ప్రధాని వ్యక్తిగత ప్రాధాన్యతల మేరకే జరిగిందని, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలోనే కోట్ల రూపాయల నిధులు దారిమళ్లాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఘనతను సొంతం చేసుకునే నాయకుడు, లోపాలకు బాధ్యత వహించకుండా ఎలా దాటవేస్తారని ప్రశ్నించింది.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో SIT విచారణకు డిమాండ్ : ఈ నిధుల గోల్‌మాల్‌పై పారదర్శకమైన, సమగ్రమైన విచారణ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నిందితులను తక్షణమే గుర్తించి, చోరీకి గురైన ప్రతి పైసా లెక్కను బయటపెట్టాలని కోరింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు నేరుగా పర్యవేక్షించేలా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను ఏర్పాటు చేయాలని ప్రమోద్ తివారీ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తుతామని, నిందితులకు శిక్ష పడేవరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

