Mallikarjun Kharge: దేశ ఉప రాష్ట్రపతి ఎన్నిక కేవలం ఒక పదవి కోసం జరుగుతున్న పోటీ కాదని, ఇది దేశ ప్రజల ఆత్మ కోసం సాగుతున్న సైద్ధాంతిక యుద్ధమని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఢిల్లీలోని సంసద్ భవన్ లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఇతర ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్నారు.
ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని రాజకీయంగా అమలు చేస్తోందని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తాము భారత రాజ్యాంగంలోని విలువలను మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగుతున్నామని అన్నారు. రాజ్యాంగ పునాదులైన న్యాయం, సమానత్వం, సమగ్రత విలువలను తన జీవితంలో ప్రతిబింబించిన వ్యక్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని అభినందించారు ఖర్గే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజ్యసభలో నిష్పక్షపాతతను, గౌరవాన్ని పునరుద్ధరించడానికి అవసరమని ఖర్గే పేర్కొన్నారు.
గత 11 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తున్నారని ఖర్గేఆరోపించారు. పార్లమెంట్లో తమ సంఖ్యా బలాన్ని బీజేపీ దుర్వినియోగం చేసుకుంటోందని, వివాదాస్పదమైన రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను అణిచివేసేలా కొన్ని కొత్త బిల్లులు తెస్తున్నారని విమర్శించారు. కీలకమైన అనేక బిల్లులు సరైన చర్చ లేకుండా ఆమోదించబడుతున్నాయని, పార్లమెంటును బీజేపీ తన భావజాలం అమలుకు వేదికగా మార్చిందని మండిపడ్డారు ఖర్గే.
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య సంస్థలు భారీ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, రాజ్యసభ వివాదరహితంగా, సమగ్రంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడవాలంటే ఆధునిక న్యాయవాద రూపాన్ని కలిగిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తి అవసరమని ఖర్గే స్పష్టం చేశారు. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలో తెలంగాణ బిడ్డ, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బరిలోకి దింపినట్లు ఖర్గే చెప్పారు. సెప్టెంబర్ 9న జరిగే ఎన్నికల్లో స్టిస్ బి. సుదర్శన్ రెడ్డి గెలుపు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి చాలా కీలకంగా ఖర్గే అన్నారు.


