లంచం , మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(Gautam Adani)పై అమెరికాలో కేసు నమోదు కావడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అదానీ గ్రూప్ (Adani group)పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ఏర్పాటుచేయాలని మరోసారి డిమాండ్ చేసింది. ‘మోదానీ’ స్కామ్స్‌పై జేపీసీ ఏర్పాటుచేయాలని 2023 జనవరి నుంచి డిమాండ్ చేస్తున్నామని పేర్కొంది. ‘హమ్ అదానీ కె హై’ సిరీస్‌లో ఇప్పటివరకు వందలాది ప్రశ్నలు సంధించామని.. ఈ ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం రాలేదని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్(Jairam Ramesh) ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అదానీ సంస్థ కార్యకలాపాలపై కాంగ్రెస్ కొద్దికాలంగా ఆరోపణలు, అనుమానాలు వ్యక్తంచేస్తోన్న సంగతి తెలిసిందే.
కాగా అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీంతో అమెరికా, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీలో (Adani Green energy) అక్రమ మార్గాల ద్వారా రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని అభియోగాలు మోపారు. ఈ నేపథ్యంలో అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.