Jagdeep Dhankhar’s resignation controversy : భారత రాజకీయాల్లో ఓ అపూర్వ ఘట్టం.. ఆశ్చర్యకర రీతిలో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా.. ఆ తర్వాత పూర్తి అజ్ఞాతం! మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామా చేసి నేటికి వంద రోజులు. ఈ వంద రోజులుగా ఆయన ఎక్కడున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రధానిని నిత్యం పొగిడిన వ్యక్తికి ప్రభుత్వం ఎందుకు కనీస వీడ్కోలు కూడా పలకడం లేదు? అంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ధన్‌ఖడ్ రాజీనామా వెనుక ఉన్న అసలు కారణాలను దేశానికి చెప్పాలని డిమాండ్ చేసింది.
వంద రోజులైనా వీడ్కోలు ఏదీ?: జైరాం రమేశ్ : మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేసి 100 రోజులు పూర్తయిన సందర్భంగా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
“అత్యంత ఆశ్చర్యకరంగా జులై 21 అర్ధరాత్రి అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. ఆయన ప్రధాని మోదీని నిత్యం ప్రశంసించినప్పటికీ, చివరికి రాజీనామా చేయక తప్పలేదు. భారత రాజకీయ చరిత్రలో అపూర్వమైన ఈ ఘటన జరిగి నేటికి సరిగ్గా 100 రోజులు. అప్పటి నుంచి ఆయన పూర్తి మౌనంలోకి వెళ్లిపోయారు, కనీసం బయట కనిపించడం లేదు. కారణాలు ఏమైనప్పటికీ, గత ఉపరాష్ట్రపతుల మాదిరిగానే ఆయన కూడా గౌరవప్రదమైన వీడ్కోలు కార్యక్రమానికి అర్హుడు.”
– జైరాం రమేశ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.
ఆయన మా స్నేహితుడు కాకపోయినా : జగదీప్ ధన్‌ఖడ్ రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ప్రతిపక్షంతో స్నేహపూర్వకంగా ఏమీ లేరని, అయినప్పటికీ ప్రజాస్వామ్య సంప్రదాయాలను గౌరవించాలని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. “మాజీ ఉపరాష్ట్రపతి ప్రతిపక్షాన్ని నిరంతరం, అన్యాయంగా వేధించారు. అయినప్పటికీ, ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం ఆయనకు సరైన వీడ్కోలు లభించాల్సిందేనని ప్రతిపక్షం భావిస్తోంది. కానీ వంద రోజులైనా అది జరగలేదు,” అని ఆయన పేర్కొన్నారు.
ఆరోగ్యం కాదు.. అంతకుమించి : ధన్‌ఖడ్ తన రాజీనామాకు ఆరోగ్య సమస్యలను కారణంగా చూపినప్పటికీ, దాని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజే ఆయన రాజీనామా చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఆయన్ను ఆ పదవిలో కూర్చోబెట్టిన మోదీ ప్రభుత్వమే, ఇప్పుడు ఆయన రాజీనామా వెనుక దాగి ఉన్న అసలు కారణాలను దేశ ప్రజలకు వెల్లడించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. రాజ్యసభ ఛైర్మన్‌గా ప్రతిపక్షంతో నిత్యం ఘర్షణ పడిన ధన్‌ఖడ్‌పై విపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం, స్వతంత్ర భారత చరిత్రలో అదే తొలిసారి కావడం గమనార్హం.
ట్రంప్‌తో ఆలింగనాలకు ఇక మోదీ దూరం : మరోవైపు, భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలపై కూడా జైరాం రమేశ్ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. “యుద్ధం ఆపకపోతే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనని చెప్పి భారత్-పాక్ ఘర్షణలను ఆపానని ట్రంప్ ఇప్పటికి 54 సార్లు చెప్పారు. నిన్న జపాన్‌లోనూ ఇదే మాట అన్నారు. దీన్ని బట్టి చూస్తే, ఇకపై ప్రధాని మోదీ తన స్నేహితుడు ట్రంప్‌ను కౌగిలించుకోవడానికి ఇష్టపడకపోవచ్చు,” అని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు.


