HomeTop StoriesJairam Ramesh: 'మోదీకి మెలోడీల ముచ్చట.. దేశ ఆర్థిక వ్యవస్థ అగచాట్లు'

Jairam Ramesh: ‘మోదీకి మెలోడీల ముచ్చట.. దేశ ఆర్థిక వ్యవస్థ అగచాట్లు’

Indian Economy Crisis and Congress Criticism: గంగాధరుడే శక్తిమాన్ అన్నట్లు.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకునే మోదీ ప్రభుత్వ విధానాలు ఇప్పుడు పెట్టుబడిదారులనే బెంబేలెత్తిస్తున్నాయా? మొన్నటిదాకా సర్కారుకు వత్తాసు పలికిన ఆర్థిక నిపుణులు సైతం దేశ ఆర్థిక స్థితిగతులపై ఇప్పుడు గొంతు మార్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారా? ఇటలీ పర్యటనలో ‘మెలోడీ’ టోఫీలు పంచడంలో బిజీగా ఉన్న మన ప్రధానమంత్రికి.. సామాన్యుడి కష్టాలు, సన్నగిల్లుతున్న విదేశీ పెట్టుబడులు కనిపించడం లేదా? ‘చందా లో.. ధంధా దో’ అంటూ కేంద్రం సాగిస్తున్న బంధుప్రీతి రాజకీయాలతో స్వదేశీ మదుపరులు సైతం ఎందుకు భయపడి విదేశాలకు పారిపోతున్నారు?కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎత్తిచూపిన ఈ చేదు వాస్తవాల వెనుక దాగి ఉన్న అసలు ఆర్థిక గుట్టు ఏమిటో ఒక్కసారి చూద్దామా?

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/world-bee-day-2026-celebrated-with-great-fervor/

పెట్టుబడుల్లో స్తబ్దత.. సామాన్యుడికి ద్రవ్యోల్బణపు సెగ: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్, సీనియర్ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’  వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుంటే, వృద్ధి రేటు అంచనాలు మాత్రం గణనీయంగా పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) పాతాళానికి పడిపోవడానికి సప్లై చైన్ (సరఫరా గొలుసు) నిర్వహణలో మోదీ సర్కారు వైఫల్యమే కారణమని ఆయన కుండబద్దలు కొట్టారు. పైగా, వినియోగాన్ని తగ్గించుకోవాలని సాక్షాత్తూ ప్రధానమంత్రే ప్రజలకు నీతిబోధలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

వేతనాలు పెరగవు.. వినియోగం ఎక్కడినుంచి వస్తుంది : కార్పొరేట్ సంస్థల పన్నులు రికార్డు స్థాయిలో తగ్గిస్తూ, వారి లాభాలు మాత్రం ఆకాశాన్ని తాకేలా ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయి. దానికి తగ్గట్టే స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్లు కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి. కానీ, సామాన్య ఉద్యోగుల వాస్తవ వేతనాలు మాత్రం పెరగడం లేదు. జేబులో డబ్బులు లేకపోతే ప్రజలు వస్తువులను ఎలా కొంటారు? వినియోగదారుల డిమాండ్ లేనప్పుడు ప్రైవేటు సంస్థలు కొత్త పెట్టుబడులు పెట్టే సాహసం ఎలా చేస్తాయి? ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల జోరు లేకుండా ఆర్థిక వృద్ధి అసాధ్యమని రమేశ్ స్పష్టం చేశారు.

జ్ఞానేశ్’ తో కాదు.. ‘జ్ఞానం’ తో పనిజరగాలి : ఎన్నికల సంఘం కమిషనర్ ‘జ్ఞానేశ్ కుమార్’ సాయంతో ఎన్నికలను నెట్టుకొస్తున్న ప్రధాని మోదీ.. కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడానికి మాత్రం తక్షణమే “కొత్త జ్ఞానం” సంపాదించాల్సిన అవసరం ఉందంటూ జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాత పద్ధతులు, ప్రగల్భాలతో ఇక లాభం లేదని, ఆర్థిక విధాన రూపకల్పనలో సమూల మార్పులు రావాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read: https://teluguprabha.net/telangana/telangana-cm-revanth-reddy-hikes-minimum-wages-for-workers/

చందా లో – ధంధా దో’.. భయంలో మదుపరులు : ప్రస్తుతం భారతీయ వ్యాపార రంగం ‘అడకత్తెరలో పోకచెక్క’లా మారింది. ప్రభుత్వ విధానపరమైన మార్పులు, పన్ను నోటీసులు, దర్యాప్తు సంస్థల దాడులు (ఈడీ, సీబీఐ), బెదిరింపుల కారణంగా పెట్టుబడిదారుల్లో విపరీతమైన అభద్రతాభావం నెలకొంది. మోదీ ప్రభుత్వ ‘చందా లో ధంధా దో’ (విరాళాలు ఇవ్వండి – వ్యాపారం చేసుకోండి) విధానం వల్ల కేవలం ప్రభుత్వానికి సన్నిహితులైన ఒకరిద్దరు బడా బాబులకు మాత్రమే లబ్ధి చేకూరుతోంది. ‘మోదానీ’ (మోదీ + అదానీ) బంధుప్రీతి ఇందుకు చక్కటి ఉదాహరణ అని కాంగ్రెస్ ఆరోపించింది. వ్యాపార రంగంలో ఈ అనారోగ్యకరమైన గుత్తాధిపత్యం కారణంగా విసిగిపోయిన అనేకమంది స్వదేశీ సంపన్నులు విదేశాలకు తరలిపోతూ అక్కడే పెట్టుబడులు పెడుతున్నారని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News