Rahul Gandhi Fishing in Bihar Election Campaign: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, విపక్ష నేతలు హోరాహోరీగా ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ.. చెరువులో దిగి చేపలు పట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ.. బెగుసరాయ్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన మత్స్యకారులతో కలిసి చేపల వేటకి దిగారు. ఉమ్మడి ర్యాలీలు, సభల్లో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ఇద్దరూ.. పట్నాలోని ఒక చెరువుకు వెళ్లి అక్కడ వారు ఫిషింగ్ చేసేందుకు నీళ్లలోకి దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

మాజీ మంత్రి, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ వ్యవస్థాపకుడు, విపక్ష కూటమి డిప్యూటీ సీఎం అభ్యర్థి ముకేశ్ సాహ్నీతో కలిసి రాహుల్ గాంధీ ఓ చెరువులో బోటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చేపలు పట్టేందుకుగాను ముకేశ్ సాహ్నీ నీళ్లలోకి దిగి వల వేయగా.. ఉత్సాహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ కాసేపటికి ఆయన కూడా నీళ్లలో దూకి అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. మత్స్యకారులతో కలిసి కాసేపు ఈత కొట్టడంతో పాటు చేపలు పట్టారు.

Also Read: https://teluguprabha.net/telangana-news/ktr-comments-on-congress-in-hydraa-presentation/
పోలింగ్ గడువు తేదీ దగ్గర పడుతున్న సమయంలో రాహుల్ గాంధీ సైన్యం.. ఇలా సరదాగా చేపలు పట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బిజీబిజీ పర్యటనలతో అలసిపోయి ఉన్న వీరంతా కాసేపు రాజకీయాలను పక్కనపెట్టి ఇలా ఉల్లాసంగా గడపడం స్థానికులతో పాటు నెటిజన్లకు కనువిందును కలిగించింది.

కాంగ్రెస్ అధికారిక ‘X’ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసిన తేజస్వి యాదవ్.. ట్వీట్ చేశారు. “జీవితం సముద్రం వంటిది, ఇక్కడ మీరు ఏ సవాలును చేపగానైనా పట్టుకోవచ్చు. జీవితం, రాజకీయాలు, సమాజం వివిధ అంశాలపై రాహుల్ జీతో అద్భుతమైన సంభాషణ జరిగింది.” అని పేర్కొన్నారు. ఈ సరదా సంఘటన ఇద్దరు యువ నేతలు మధ్య బలమైన స్నేహ బంధాన్ని, దృఢమైన కూటమి బంధాన్ని చాటుకోవడాన్ని ప్రదర్శిస్తుంది. రాజకీయ నేతలు ప్రచార ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇలాంటి సరదా పనులు మరింత ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయనడంలో సందేహం లేదు.
नेता विपक्ष श्री @RahulGandhi ने बेगूसराय में मछुआरा समुदाय से मुलाकात की और उनकी समस्याओं पर चर्चा की।
इस दौरान VIP पार्टी के अध्यक्ष मुकेश सहनी जी भी मौजूद रहे।
हम बिहार के मछुआरा समुदाय के सम्मान और उनके अधिकारों के लिए हर कदम पर साथ खड़े हैं।
📍 बिहार pic.twitter.com/RYbgDAZH66
— Congress (@INCIndia) November 2, 2025
బిహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 14న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఇప్పటికే అధికార, విపక్ష కూటములు తమ మేనిఫెస్టోలను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమి తాము అధికారంలోకి వస్తే యువతకు కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వగా.. మరోవైపు మహాగఠ్‌బంధన్ కూటమి(ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్), సీపీఐ, సీపీఐ(ఎం)) తాము గెలిస్తే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అదేవిధంగా పలు పథకాలను కూడా ప్రకటించారు. మరి ముఖ్యమంత్రి పీఠం ఏ పార్టీని వరిస్తుందో వేచి చూడాలి.


