Rahul Gandhi| లంచం ఆరోపణలతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gautam adani)పై అగ్రరాజ్యం అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. అదానీ లంచం ఇచ్చినట్లు యూఎస్ ఏజెన్సీలు చెబుతున్నాయని పేర్కొన్నారు. అదానీ రూ.2000కోట్ల స్కామ్ చేశారని ఆరోపించారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేసి విచారిస్తే నిజాలన్నీ బయటకు వస్తాయని తెలిపారు.
అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందన్నారు. ప్రధాని మోదీ, అదానీల బంధం భారత్‌లో ఉన్నంత వరకే సురక్షితమన్నారు. తాజా ఆరోపణలపై తక్షణమే జాయింట్ పార్లమెంట్ కమిటీ(JPC)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టం చేశారు. అదానీని రక్షిస్తున్న సెబీ చీఫ్ మాదభి పురి బచ్‌ను ఆ పదవి నుంచి తొలగించి ఆమె పైనా విచారణ జరపాలన్నారు. ప్రధానిగా మోదీ ఉన్నంతకాలం అదానీ అరెస్ట్ కారని.. ఇందుకు తాను గ్యారంటీ ఇస్తానని చెప్పుకొచ్చారు.