Thursday, March 12, 2026
Homeనేషనల్Lok Sabha : స్పీకర్‌పై విపక్షాల ‘సమరశంఖం’.. ఓం బిర్లా తొలగింపునకు కాంగ్రెస్ అవిశ్వాస నోటీసు!

Lok Sabha : స్పీకర్‌పై విపక్షాల ‘సమరశంఖం’.. ఓం బిర్లా తొలగింపునకు కాంగ్రెస్ అవిశ్వాస నోటీసు!

No-Confidence Motion against Lok Sabha Speaker : దేశ అత్యున్నత చట్టసభలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహారశైలిపై విపక్షాలు ‘యుద్ధం’ ప్రకటించాయి. సభను నిష్పక్షపాతంగా నడపడం లేదని, విపక్షాల గొంతు నొక్కుతున్నారన్న ఆరోపణలతో ఏకంగా ఆయననే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ‘అవిశ్వాస అస్త్రాన్ని’ సంధించాయి. 120 మంది ఎంపీల సంతకాలతో కూడిన నోటీసు ఇప్పుడు హస్తిన రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

- Advertisement -

ఆర్టికల్ 94-C అస్త్రం: 120 మంది ఎంపీల సంతకాలు : లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అధికారికంగా నోటీసులు అందజేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-C మరియు లోక్‌సభ నిబంధన 94-సి కింద ఈ తొలగింపు తీర్మానాన్ని ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ సీనియర్ ఎంపీ గౌరవ్ గొగోయ్ స్పష్టం చేశారు. ఈ నోటీసుపై కాంగ్రెస్‌తో పాటు డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మరియు ఇతర ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన సుమారు 120 మంది ఎంపీలు సంతకాలు చేయడం గమనార్హం.
మండిపడుతున్న విపక్షం: ఆగ్రహానికి కారణాలు ఇవే!

స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉండటానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.

రాహుల్ గాంధీ ప్రసంగం: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా పదే పదే అడ్డుకున్నారని, ఆయన ప్రసంగంలోని కీలక భాగాలను రికార్డుల నుంచి తొలగించారని విపక్షం ఆరోపిస్తోంది.

సస్పెన్షన్ల పర్వం: సభలో నిరసన తెలిపిన 8 మంది ప్రతిపక్ష సభ్యులను ఏకపక్షంగా సస్పెండ్ చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.

ఏకపక్ష వైఖరి: అధికార పక్షానికి కొమ్ముకాస్తూ, ప్రతిపక్ష ఎంపీల హక్కులను కాలరాస్తున్నారని, మహిళా ఎంపీల పట్ల కూడా వివక్ష చూపుతున్నారని నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.

రాజ్యాంగ ప్రక్రియ ఏమిటి : రాజ్యాంగం ప్రకారం స్పీకర్‌ను తొలగించాలంటే 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత సభలో మెజారిటీ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తేనే స్పీకర్ తన పదవిని కోల్పోతారు. ప్రస్తుత లోక్‌సభ బలాబలాలను బట్టి ఈ తీర్మానం నెగ్గడం కష్టమే అయినప్పటికీ, స్పీకర్ వైఖరిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నదే విపక్షాల ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News