Congress Party Questioned PM Modi : కాంగ్రెస్ పార్టీ పహల్గాం ఉగ్రదాడి, భద్రతా చర్యలు, విదేశాంగ విధాన సవాళ్లపై పార్లమెంట్‌లో చర్చించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేసింది. చైనా, పాక్‌ల విషయంలో భవిష్యత్ వ్యూహంపై అఖిలపక్ష నేతల అభిప్రాయాలు తీసుకోవాలని, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యలపై చర్చ జరగాలని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కోరారు.
పహల్గాం ఉగ్రవాదులపై చర్యలు:
జైరాం రమేశ్ పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారిని పట్టుకుని కోర్టు ఎదుట నిలబెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. 2023 డిసెంబరులో పూంచ్‌లో, 2024లో గగన్ గిర్, గుల్మార్గ్‌లలో జరిగిన దాడుల్లో ఈ ఉగ్రవాదుల పాత్ర ఉందని ఆయన గుర్తు చేశారు.
‘ఆపరేషన్ సిందూర్’పై అధ్యయన కమిటీ డిమాండ్:
కార్గిల్ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన కార్గిల్ రివ్యూ కమిటీ తరహాలో ‘ఆపరేషన్ సిందూర్’పైనా అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని జైరాం రమేశ్ కేంద్ర సర్కారును కోరారు. ఈ కమిటీ ఇచ్చే సలహాలతో భవిష్యత్ యుద్ధ వ్యూహాలను, సైనిక వేదికలను బలోపేతం చేసుకోవచ్చని, అధునాతన సైనిక సాంకేతికతను మెరుగుపర్చుకోవచ్చని, సంక్షోభ సమయంలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చని ఆయన వివరించారు.
యూఏపీఏ దుర్వినియోగంపై కాంగ్రెస్ ఆరోపణలు:
కాంగ్రెస్ మీడియా, పబ్లిసిటీ విభాగం అధిపతి పవన్ ఖేఢా యూఏపీఏ వంటి చట్టాలను ప్రభుత్వ వ్యతిరేకులను అణచివేయడానికి దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించి రాజ్యాంగంపై దాడి చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆయన అన్నారు. 2014 నుంచి 2022 మధ్య నమోదైన 8,719 యూఏపీఏ కేసుల్లో కేవలం 2.55 శాతం మంది మాత్రమే దోషులుగా తేలారని, ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ విమర్శకులు, విద్యార్థులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపైనే ఈ కేసులు నమోదయ్యాయని ఖేఢా పేర్కొన్నారు.
CONGRESS PARTY QUESTIONED PM MODI: పహల్గాం దాడి భద్రతా చర్యలపై ప్రధాని మోదీని ప్రశ్నించిన కాంగ్రెస్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES