KC Venu Gopal wrote a letter to Amit Shah: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని చేసిన హత్యా బెదిరింపులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. బెదిరింపులకు పాల్పడిన నేతపై చర్యలు తీసుకోకపోతే.. అది లోక్‌సభలో ప్రతిపక్ష నేతపై జరుగుతున్న హింసకు సహకరించినట్లుగా అవుతుందని వేణుగోపాల్ ఆ లేఖలో స్పష్టం చేశారు.
కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు: రాహుల్ గాంధీ భద్రతను పర్యవేక్షిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కూడా ఆయన భద్రతకు ముప్పు ఉందని హోంశాఖకు గతంలో లేఖలు రాసిన విషయాన్ని వేణుగోపాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మల్లికార్జున ఖర్గేకు సీఆర్‌పీఎఫ్ రాసిన లేఖ మీడియాకు లీక్ కావడం కూడా అనుమానాస్పదంగా ఉందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీపై వచ్చిన బెదిరింపు కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదని.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిపై జరిగిన దాడి అని వేణుగోపాల్ పేర్కొన్నారు.
టీవీ చర్చలో వివాదాస్పద వ్యాఖ్యలు: కేసీ వేణుగోపాల్ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం (ఏబీవీపీ) మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ ప్రతినిధి అయిన ప్రింటు మహదేవ్ ఒక మలయాళ ఛానెల్‌లో జరిగిన టెలివిజన్ చర్చా కార్యక్రమంలో రాహుల్ గాంధీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ఛాతీపై కాల్చి చంపాలని మహదేవ్ బహిరంగ ప్రకటన చేసినట్లు వేణుగోపాల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు కేవలం నోరు జారడం కాదని అన్నారు. ఏబీవీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు దేశంలోని అగ్ర రాజకీయ నాయకులలో ఒకరికి ఎదురైన హత్యా బెదిరింపులే అని వేణుగోపాల్ గట్టిగా పేర్కొన్నారు.
Also Read:https://teluguprabha.net/national-news/amit-shah-strong-warning-to-maoist/
భద్రతా ప్రమాణాలకు భంగం: బీజేపీ ప్రతినిధి చేసిన ఈ ‘విషపూరిత’ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఏర్పడటమే కాకుండా.. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక భద్రతా హామీలకు భంగం కలిగించినట్లు అవుతుందని వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. హోంశాఖ బహిరంగంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ ఉద్దేశపూర్వక చర్యకు పరోక్షంగా సహకరించినట్లు అవుతుందని కేసీ వేణుగోపాల్ హోంమంత్రికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని తమ హక్కుల పరిరక్షకునిగా భావిస్తున్న లక్షలాది మంది భారతీయులు ఈ పరిణామాలపై ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు.


