Shashi Tharoor on nepotism : భారత రాజకీయాల్లో కుటుంబ పాలన ఓ వ్యాపారంగా మారిందంటూ సొంత పార్టీ ఎంపీ శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. ఆయన రాసిన వ్యాసంపై పార్టీ సీనియర్ నేత రషీద్ అల్వీ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఆంక్షలు విధించలేరంటూ థరూర్ వాదనను గట్టిగా వ్యతిరేకించారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అగ్ర నేతలు వారసత్వ రాజకీయాలపై ఇలా భిన్న స్వరాలు వినిపించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు థరూర్ ఏమన్నారు? దానికి అల్వీ కౌంటర్ ఎలా ఇచ్చారు? వివరాల్లోకి వెళ్తే..
థరూర్ వ్యాసం.. అల్వీ ప్రతిస్పందన : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇటీవల “భారత రాజకీయాలు ఒక కుటుంబ వ్యాపారం” (‘Indian Politics Are a Family Business’) పేరుతో ఒక వ్యాసం రాశారు. ఇందులో దేశ రాజకీయాల్లో వేళ్లూనుకుపోయిన బంధుప్రీతి, వారసత్వ సంస్కృతిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ వ్యాసంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రషీద్ అల్వీ ఘాటుగా స్పందించారు.
ప్రజలే అంతిమ నిర్ణేతలు: అల్వీ : రషీద్ అల్వీ తన వాదనను బలంగా వినిపించారు. “ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ప్రజలదే,” అని ఆయన స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలపై థరూర్ విమర్శలను తోసిపుచ్చుతూ, “కేవలం మీ తండ్రి ఎంపీగా పనిచేశారు కాబట్టి, మీరు ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పే ఆంక్షలను విధించలేరు,” అని అన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.
అన్ని రంగాల్లోనూ ఉందిగా : బంధుప్రీతి కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదని అల్వీ అన్నారు. “ఇది ప్రతి రంగంలోనూ జరుగుతోంది… దీనికి మీరెలాంటి పరిష్కారం కనుగొంటారు?” అని ఆయన ప్రశ్నించారు. వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారులు.. ఇలా అన్ని వృత్తుల్లోనూ వారసత్వం కొనసాగుతున్నప్పుడు, కేవలం రాజకీయాలను మాత్రమే వేలెత్తి చూపడం సరికాదన్నది ఆయన వాదన. ఈ పరిణామం, వారసత్వ రాజకీయాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత మథనానికి దారితీసినట్లు కనిపిస్తోంది.


