Bill to remove Chief Ministers : పార్లమెంటు వేదికగా మరో రాజకీయ యుద్ధానికి తెరలేచింది. తీవ్రమైన నేరారోపణలపై అరెస్టయి, నిర్బంధంలో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుండటం పెను దుమారం రేపుతోంది. ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని, ఎన్నికల్లో ఓడించలేని ప్రతిపక్ష ముఖ్యమంత్రులను, కేంద్ర దర్యాప్తు సంస్థల చేత అరెస్టు చేయించి, గద్దె దించాలనే దుర్మార్గపు ఆలోచనతోనే బీజేపీ ఈ బిల్లులను తీసుకొస్తోందని కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ఇంతకీ ఈ బిల్లుల వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? కేవలం అవినీతి నిర్మూలనా లేక రాజకీయ కక్ష సాధింపా..? ఈ వివాదం వెనుక ఉన్న వాదనలు, ప్రతివాదనలేంటో చూద్దాం.
ఇదో దుర్మార్గపు వలయం: అభిషేక్ సింఘ్వీ :కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లులపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదొక “దుర్మార్గపు వలయం” (vicious cycle) అని అభివర్ణిస్తూ, బీజేపీ వ్యూహాన్ని ఆయన దశలవారీగా వివరించారు.
మొదటి అడుగు: కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారిన దర్యాప్తు సంస్థల ద్వారా, ఎలాంటి సరైన మార్గదర్శకాలు పాటించకుండా ప్రతిపక్ష నాయకులను, ముఖ్యంగా ముఖ్యమంత్రులను అరెస్టు చేయించడం.
రెండో అడుగు: ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన చట్టాన్ని అడ్డం పెట్టుకుని, అరెస్ట్ అయిన వెంటనే వారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం.
తుది లక్ష్యం: తద్వారా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో రాజకీయ అస్థిరతను సృష్టించి, ప్రభుత్వాలను కూల్చడం. “ఎన్నికల్లో గెలవలేక, ఈ అడ్డదారిని ఎంచుకున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రులను మాత్రం ఎవరూ, ఎప్పుడూ తాకరు!” అని సింఘ్వీ తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
రాహుల్ యాత్ర నుంచి దృష్టి మరల్చేందుకే :ఈ బిల్లుల సమయంపై కూడా కాంగ్రెస్ పార్టీ సందేహాలు వ్యక్తం చేస్తోంది. బిహార్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘ఓటు అధికార్ యాత్ర’కు వస్తున్న అపూర్వ ప్రజా స్పందనను చూసి ఓర్వలేక, ప్రజల దృష్టిని మళ్లించడానికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లుల నాటకానికి తెరతీశారని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. “మొదట CSDS-BJP ఐటీ సెల్ డ్రామా, ఇప్పుడు ఈ బిల్లులు. బిహార్‌లో మార్పు గాలులు స్పష్టంగా వీస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం,” అని ఆయన వ్యాఖ్యానించారు.
అసలు ఈ బిల్లుల్లో ఏముంది : విపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నా, ఈ బిల్లుల ద్వారా కేంద్రం కొన్ని కీలకమైన చట్టపరమైన, రాజ్యాంగపరమైన సవరణలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం..
ప్రధాన నిబంధన: తీవ్రమైన నేరారోపణలపై అరెస్టయి, వరుసగా 30 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర మంత్రులను అయినా పదవి నుంచి తొలగించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
చట్ట సవరణలు: ప్రస్తుతం ఉన్న చట్టాలలో ఇటువంటి నిబంధనలు లేనందున, కేంద్రం మూడు కీలక సవరణ బిల్లులను తీసుకురానుంది.
గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ (సవరణ) బిల్లు: 1963 చట్టంలోని సెక్షన్ 45కు సవరణలు చేస్తారు.
130వ రాజ్యాంగ సవరణ బిల్లు: రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164, 239AA లకు సవరణలు అవసరం.
జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు: 2019 చట్టంలోని సెక్షన్ 54ను సవరించాల్సి ఉంటుంది. ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన తర్వాత, వాటిని మరింత లోతైన పరిశీలన కోసం పార్లమెంటరీ సంయుక్త కమిటీకి పంపే తీర్మానాన్ని హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెడతారని తెలుస్తోంది.


