Madhya Pradesh Fake syrup: మధ్యప్రదేశ్‌లో కల్తీ దగ్గు సిరప్ ఘటన మరువకముందే మరో కల్తీ మందు వ్యవహారం వెలుగు చూసింది. ఈసారి గ్వాలియర్‌లోని మురార్ జిల్లా ఆసుపత్రిలో పిల్లలకు ఇచ్చే యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ ఓరల్ సస్పెన్షన్ సిరప్‌లో పురుగులు కనిపించడంతో ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది.
ఆరోగ్యం బాగోలేని చిన్నారికి ఈ మందు ఇవ్వబోయే ముందు సీసా తెరిచి చూడగా అందులో నల్లని పురుగు లాంటి పదార్థాలు ఉన్నట్లు చిన్నారి తల్లి గుర్తించింది. వెంటనే ఆమె ఆ సిరప్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లి సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్కే శర్మకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు అందిన వెంటనే ఆసుపత్రి అధికారులు, ఫుడ్ అండ్ డ్రగ్ విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/dhanteras-2025-items-to-avoid-buying-on-dhan-trayodashi/
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అనుభూతి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఆ బృందం ఆసుపత్రి ఫార్మసీని సందర్శించి సిరప్ నమూనాలను సేకరించింది. అదే సమయంలో అజిత్రోమైసిన్ సిరప్ పంపిణీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఇతర కేంద్రాలకు పంపిన సిరప్‌ను కూడా వెనక్కి తెప్పించే చర్యలు ప్రారంభమయ్యాయి.
పిల్లల మందుల నాణ్యతను..
దర్యాప్తులో భాగంగా అధికారులు ఇతర పిల్లల మందుల నాణ్యతను కూడా పరిశీలించారు. ప్రాథమిక విచారణలో ఈ సిరప్ భోపాల్‌లోని ప్రభుత్వ స్టోర్ నుంచి గ్వాలియర్ ఆసుపత్రికి సరఫరా అయినట్లు తెలిసింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అనుభూతి శర్మ మాట్లాడుతూ సేకరించిన నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపినట్లు తెలిపారు. నివేదికలో ఏదైనా నాణ్యతా లోపం లేదా హానికరమైన పదార్థాలు ఉన్నట్లు తేలితే, సంబంధిత కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. ల్యాబ్ ఫలితాల కోసం అధికారులు వేచిచూస్తున్నారు.
సిరప్‌ను ఉపయోగించవద్దని…
ఇంతలో ఆరోగ్య శాఖ ఈ సంఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంది. మురార్ ఆసుపత్రి సహా ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆ సిరప్‌ను ఉపయోగించవద్దని సూచనలు పంపింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు పంపిణీ, వినియోగం నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు.
కల్తీ దగ్గు సిరప్…
ఈ సంఘటన వెలుగులోకి రావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. గతంలో కల్తీ దగ్గు సిరప్ కారణంగా పిల్లల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అటువంటి సంఘటనలు మరలా జరగకుండా ఉండేందుకు అధికారులు పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు.
ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్‌మెంట్…
ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్‌మెంట్ ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంది. భోపాల్ స్టోర్ నుండి పంపిణీ అయిన మొత్తం సిరప్ బ్యాచ్‌ను తిరిగి సేకరించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి మందులు అందుబాటులో ఉన్నాయా అని చెక్ చేస్తున్నారు.
నాణ్యతా ప్రమాణాలను..
ఆరోగ్య నిపుణులు ఈ ఘటనను ఒక హెచ్చరికగా అభివర్ణిస్తున్నారు. మందుల తయారీ ప్రక్రియలో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలపై కఠిన నియంత్రణ అవసరమని సూచనలు వస్తున్నాయి.
Also Read: https://teluguprabha.net/devotional-news/jade-plant-brings-wealth-prosperity-and-positivity-at-home/
ఈ కేసులో సంబంధిత సంస్థ పేరు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ల్యాబ్ నివేదికలు అందిన తర్వాతే ఆ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా మందు తయారీ కంపెనీ లేదా సరఫరాదారు పై చర్యలు తీసుకునే దిశగా అధికారులు ముందుకు వెళ్తారు.


