Homeనేషనల్War effect: మంట పుట్టిస్తున్న వంటనూనె.. యుద్ధం సాకుతో పెరిగిన ధరలు!

War effect: మంట పుట్టిస్తున్న వంటనూనె.. యుద్ధం సాకుతో పెరిగిన ధరలు!

Cooking oil: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల ప్రభావం సామాన్యుడి వంటింటిపై పడుతోంది. ఇప్పటికే నిత్యావసరాలు, రవాణా ఖర్చుల భారంతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. తాజాగా వంటనూనెల ధరల పెరుగుదల గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. గత వారం రోజులుగా వంటనూనెల ధరలు భారీగా పెరగడం సగటు వేతన జీవిని ఆందోళనకు గురిచేస్తోంది.

- Advertisement -

కృత్రిమ కొరతతో బ్లాక్ మార్కెట్ దందా!: యుద్ధం కారణంగా భవిష్యత్తులో నూనె నిల్వలు నిలిచిపోతాయనే ప్రచారాన్ని వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మార్కెట్‌లో నూనె దొరకదనే భయాన్ని వ్యాపారులు సృష్టిస్తున్నారు. దీంతో కృత్రిమ కొరత ఏర్పడుతుంది. నల్గొండ వంటి జిల్లాల్లో వినియోగదారులు భయాందోళనతో ఒక్కసారిగా 10 నుండి 15 లీటర్ల డబ్బాలను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న కొందరు డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు వంట నూనెను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

లీటరుపై రూ. 20 నుంచి 30 పెంపు: మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం కేవలం వారం వ్యవధిలోనే లీటర్ నూనె ప్యాకెట్‌పై సగటున రూ. 20 నుండి రూ. 30 వరకు ధర పెరిగింది. విజయ బ్రాండ్‌కు చెందిన పల్లీ నూనె హోల్‌సేల్ ధర రూ. 180 ఉండగా రిటైల్ దుకాణాల్లో రూ. 185 దాటిపోయింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ హోల్‌సేల్‌గా రూ. 180 పలుకుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా రూ. 200 వరకు విక్రయిస్తున్నారు. ప్యాకెట్లపై ధర తక్కువగా ఉన్నప్పటికీ.. స్టాక్ లేదనే నెపంతో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.

Also read-Gas Booking Rules: పండుగల ముందు గ్యాస్ ఆందోళన… బుకింగ్ గ్యాప్ పెంచిన కేంద్రం, ప్రజల్లో టెన్షన్

చాయ్ నుంచి కూరగాయల వరకు: యుద్ధ ప్రభావం కేవలం నూనెలకే పరిమితం కాలేదు. గ్యాస్ కొరతతో పాటుగా రవాణా ఛార్జీలు పెరగడంతో కూరగాయల ధరలను సైతం అమాంతం పెంచేశారు. నిన్నటి వరకు రూ. 10 ఉన్న ఒక కప్పు టీ ధర.. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో రూ. 20కి చేరింది. యుద్ధం ఇలాగే కొనసాగితే లీటరు నూనె రూ. 250 దాటుతుందనే పుకార్లు సామాన్యుడిని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి మార్కెట్‌లో జరుగుతున్న ఈ కృత్రిమ దోపిడీని అరికట్టాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. ధరల నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని వినియోగదారులు ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News