Cough Syrup NHRC: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జలుబు, దగ్గు కారణంగా దగ్గు మందు తీసుకున్న 12 మంది చిన్నారులు మృతి చెందడం కలకలం రేపిన విషయం తెలిసిందే. చిన్నారులకు ఇచ్చిన దగ్గు మందు శాంపిల్ పరీక్షల్లో కల్తీ అని తేలడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.. రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ రాష్ట్రాలను కూడా దీనిపై నివేదిక ఇవ్వాలని కోరింది. తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై స్పందించింది.
కల్తీ దగ్గు మందు ఘటనలో ఆయా రాష్ట్రాల్లో చిన్నారులు మృతి చెందిన ఘటనపై దర్యాప్తు చేయాలని సంబంధిత ప్రభుత్వాలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. కల్తీ మందుల విక్రయాలను నిషేధించాలని ఆదేశించింది. రెండు వారాల్లోగా దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌లకు కమిషన్ పలు సూచనలు చేసింది. కల్తీ ఔషధాల సరఫరాపై దర్యాప్తునకు ఆదేశించాలని సూచించింది. కల్తీ మందుల నమూనాలను సేకరించి పరీక్ష నివేదికలను సమర్పించేలా ప్రాంతీయ ప్రయోగశాలలకు ఆదేశాలు జారీ చేయాలని కమిషన్ స్పష్టం చేసింది.


