Madhya Pradesh cough syrup deaths : దగ్గు వస్తే ఉపశమనం ఇవ్వాల్సిన మందే యమపాశమైంది. వైద్యుడు రాసిచ్చిన సిరప్పే పసిపిల్లల పాలిట విషంగా మారింది. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘోర విషాదంలో ఏకంగా 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అసలు ఆ దగ్గు మందులో ఏముంది? అమాయక చిన్నారుల మరణానికి కారణమైన ఆ వైద్యుడి పాత్రేంటి…? ఈ దారుణం వెనుక ఉన్న ఫార్మా కంపెనీ ఎక్కడది…?
జబ్బు నయం చేస్తాడని నమ్మి వెళ్లిన వైద్యుడే పసిప్రాణాల పాలిట కాలయముడయ్యాడు. ఆయన రాసిచ్చిన దగ్గు మందు 10 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దగ్గు మందు వికటించి 10 మంది చిన్నారులు మరణించిన ఈ కేసులో, ఆ సిరప్‌ను సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, ఆ విషపూరిత మందును తయారు చేసిన తమిళనాడులోని కాంచీపురం కేంద్రంగా పనిచేస్తున్న “శ్రీసన్ ఫార్మా” కంపెనీపై కూడా కేసు నమోదు చేశారు.
విచారణలో విస్తుపోయే నిజాలు : ఈ మరణాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. మరణించిన చిన్నారుల్లో చాలా మందికి డాక్టర్ ప్రవీణ్ సోనినే ఈ దగ్గు మందును సూచించినట్లు తేలింది. దీంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. మరోవైపు, అధికారులు ఆ దగ్గు మందు నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపగా, అందులో అత్యంత ప్రమాదకరమైన రసాయనం ఉన్నట్లు నిర్ధారణ అయింది.
శ్రీసన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన ఆ దగ్గు సిరప్‌లో ఏకంగా 48.6 శాతం “డైఇథైలిన్ గ్లైకాల్” ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఇది అత్యంత విషపూరితమైన పారిశ్రామిక రసాయనమని, దీనివల్ల కిడ్నీలు, నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని మరణం సంభవిస్తుందని అధికారులు పేర్కొన్నారు. నిర్దేశిత ప్రమాణాలను గాలికొదిలి, ప్రాణాంతక రసాయనాన్ని కలిపి మందులను తయారు చేసిన శ్రీసన్ ఫార్మా కంపెనీపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అమాయక చిన్నారుల ఉసురు తీసిన ఈ ఘటనలో బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలని మృతుల తల్లిదండ్రులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


