Drugs seized: నకిలీ మందులు విక్రయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికో ఏజెన్సీల గుట్టురట్టయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో డ్రగ్ డిపార్ట్‌మెంట్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో హే మా మెడికో, బన్సాల్ మెడికల్ ఏజెన్సీల నిర్వాకం బయటపడింది. వీరి బండారం బయటపడకుండా రూ. కోటి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన ఓ సంస్థ డైరెక్టర్‌ను సైతం అధికారులు అరెస్ట్ చేశారు.
12 రాష్ట్రాలకు నకిలీ డ్రగ్స్ సరఫరా
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆగష్టు 22న నకిలీ మందుల వ్యాపారాన్ని అధికారులు ఛేదించారు. హే మా మెడికో, బన్సాల్ మెడికల్ ఏజెన్సీపై దాడి చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని టెస్ట్ కోసం తరలించగా అవి నకిలీవని తేలింది. పుదుచ్చేరిలోని అక్రమ కర్మాగారాల నుంచి 12 రాష్ట్రాలకు ఈ నకిలీ మందులు సరఫరా అవుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
రూ. కోటి లంచం
ఈ కేసులో పట్టుబడిన హే మా మెడికో డైరెక్టర్ హిమాన్షు అగర్వాల్ రూ.1 కోటి లంచం ఇవ్వడానికి ప్రయత్నించగా.. ఆయనను కటకటాలకు పంపించారు. బన్సాల్ మెడికల్ ఏజెన్సీకి చెందిన సంజయ్ బన్సాల్‌తో పాటు మరో ఇద్దరిని సైతం అధికారులు అరెస్ట్ చేశారు. పుదుచ్చేరికి చెందిన మీనాక్షి, శ్రీ అమన్ ఫార్మా నిర్వహిస్తున్న అక్రమ కర్మాగారాల్లో ఈ నకిలీ డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ రెండు సంస్థలను అధికారులు సీజ్ చేశారు. ఈ నకిలీ డ్రగ్స్‌ను రైలులో తరలిస్తూ.. డ్రగ్ డీలర్ల ద్వారా 12 ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది.
ఈ నెల 2, 3 తేదీల్లో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO), పుదుచ్చేరి డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా మీనాక్షి ఫార్మాపై దాడి చేసింది. కొలెస్ట్రాల్, షుగర్, గుండె రోగులకు ఇచ్చే రోసువాస్ 20, 40mg మాత్రలు సహా 14 నమూనాలను హే మా మెడికో నుంచి టెస్ట్ కోసం తరలించారు.
అయితే ఔషధాలను తయారుచేసే సన్ ఫార్మా కంపెనీ, సనోఫీ ఇండియా కంపెనీ ఈ మాత్రలు తయారు చేయలేదని విచారణలో వెల్లడైందని అసిస్టెంట్ డ్రగ్ కమిషనర్ అతుల్ ఉపాధ్యాయ్ తెలిపారు. దాడుల్లో ఇవి నకిలీ మందులేనని తేలిందని స్పష్టం చేశారు.


