Bengaluru: దేశంలో అర్ధరాత్రి రోడ్డుపై నడవకూడదనే చట్టమేమీ లేదు. ఏదైనా కర్ఫ్యూ వంటి ప్రత్యేక సందర్భంలో మాత్రమే దీనిపై నిషేధం ఉంటుంది. ఎవరైనా రాత్రిపూట నడుచుకుంటూ వెళ్లినా నేరమేమీ కాదు. కానీ, ఇలా నడుచుకుంటూ వెళ్లిన ఒక జంటకు మాత్రం ఫైన్ వేశారు పోలీసులు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవల జరిగింది.
ఇటీవల కార్తీక్ పత్రి అనే వ్యక్తి తన భార్యతో కలిసి బంధువుల ఇంట్లో ఒక ఫంక్షన్‌కు వెళ్లి తిరిగొచ్చేసరికి రాత్రైంది. దాదాపు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో దంపతులు ఇద్దరూ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదే సమయంలో ఎదురుగా పెట్రోలింగ్ వాహనంలో పోలీసులు వచ్చారు. ఈ కార్తీక్ దంపతుల్ని చూసి ప్రశ్నించారు. ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. తమ బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లొస్తున్నామని, పక్కనే తమ ఇల్లు ఉందని చెప్పారు.
అయినా వినని పోలీసులు ఐడీ కార్డు, ఆధార్ కార్డు వంటివి చూపించమని అడిగారు. తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులు, ఆఫీస్ వివరాలు అడిగారు. ఫోన్లు తీసుకుని పరిశీలించారు. అలా చాలా సేపు రోడ్డు మీదే విచారించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు కార్తీక్ దంపతులు ఓపికగా సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ వదిలిపెట్టని పోలీసులు వాళ్లపై కేసులు పెడతామని బెదిరించారు. అర్ధరాత్రి పదకొండు గంటల తర్వాత నడవకూడదనే నిబంధన ఉందని తెలీదా అని ప్రశ్నించారు.
ఈ విషయం తమకు తెలియదని చెప్పింది ఆ జంట. దీంతో నిబంధనలు ఉల్లంఘించారని రూ.3,000 జరిమానా కట్టమని అడిగారు. దీంతో అంత డబ్బు తమ దగ్గర లేదని చెప్పారు. చివరకు రూ.1,000 చెల్లించేందుకు ఒప్పుకొన్నారు. పేటీఎమ్ ద్వారా ఈ డబ్బు చెల్లించాకే వాళ్లను వదిలేశారు పోలీసులు. అయితే, తర్వాత కార్తీక్ ఈ అంశాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీనికి బెంగళూరు పోలీసుల్ని ట్యాగ్ చేశారు. దీంతో స్పందించిన పోలీసులు విచారణ జరిపి, బాధ్యులైన పోలీసుల్ని సస్పెండ్ చేశారు.