Ahmedabad: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. అక్కడి పోలీసుల సమాచారం మేరకు ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య చేసుకుని విగతజీవులుగా మారారు. మరణించిన ఐదుగురిలో ముగ్గురు చిన్న పిల్లలు, ఇద్దరు పెద్దవారు ఉన్నారు.
అహ్మదాబాద్‌లోని ధోల్కా ప్రాంతంలో విపుల్ కాంజి వాఘేలా (32), సోనల్ వాఘేలా (26) ఇద్దరు దంపతులు ఉంటున్నారు. వీళ్లకి కరీనా (11), మయూర్ (8), ప్రిన్సీ(5) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆటో రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్న విపుల్ కుటుంబంలో అప్పులు పెనుభారంగా మారాయి.
అతనికి జీవనాధారమైన ఆటో రిక్షాని ఈఎంఐ విధానంలో అప్పు తీసుకుని దానిపైనే ఆధారపడి జీవిస్తున్నాడని విపుల్ బావమరిది పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. దానికి ప్రతి నెల చెల్లించాల్సిన రూ. ఐదు వేలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నానని విపుల్ బాధపడుతూ ఉండేవాడని పోలీసుల విచారణలో తెలిసింది.
ఆర్థిక ఒత్తిడి కారణంగానే విపుల్ కాంజి వాఘేలా తన భార్య, ముగ్గురు పిల్లలకి విషం ఇచ్చి, తానూ సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
Readmore: https://teluguprabha.net/national-news/shashi-tharoor-said-i-have-some-differences-with-congress/
బాగోద్ర పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్ బృందం ద్వారా ఐదుగురి మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం కోసం బాగోద్ర కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే విపుల్ కుటుంబం అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడిందా లేదా ఇంకేదైనా కారణం ఉందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


