కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఉత్తరప్రదేశ్ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్యలపై విచారణకు హాజరుకావాలని బరేలీ కోర్టు సమన్లు ఇచ్చింది. ఎన్నికల ప్రచారం సమయంలో తెలంగాణ పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే.. జనాభా ప్రాతిపదికన దేశ సంపదను పంచుతామని తెలిపారు. ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, జనాభా ప్రతిపతికనే ఇస్తామన్నారు.
అయితే రాహుల్ వ్యాఖ్యలు దేశాన్ని విడదీసేలా ఉన్నాయంటూ పంకజ్ అనే వ్యక్తి తొలుత ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు దాఖలు చేశారు. అక్కడ కేసును కొట్టివేయడంతో బరేలీ జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆదేశించింది. కాగా గతంలోనూ ఎన్నికల ప్రచారంలోప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు ఆయన పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన సంగతి తెలిసిందే.