‘Creative City Of Gastronomy’ Lucknow: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 70 గ్యాస్ట్రోనమీ నగరాల్లో లక్నో చోటుదక్కించుకుంది. హైదరాబాద్ తర్వాత ఈ టైటిల్‌ను గెలుచుకున్న రెండవ భారతీయ నగరంగా ఈ మహానగరం నిలిచింది. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్‌లో శుక్రవారం జరిగిన 43వ జనరల్ కాన్ఫరెన్స్ సమావేశంలో యునెస్కో “క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ”గా లక్నోను అధికారికంగా ప్రకటించింది.
Also Read: https://teluguprabha.net/national-news/bp-mandal-bihar-cm-mandal-commission-legacy/
లక్నో ఈ టైటిల్ గెలుచుకోవడం పట్ల పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన వంటల రుచి చూసేందుకు.. చాలా కాలంగా పర్యాటకులు ఇక్కడికి క్యూ కడుతున్నారని ఆయన అన్నారు. ‘క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ’ ట్యాగ్ ద్వారా రాష్ట్రంలో పాక పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, జనవరి 31, 2025న ‘క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ’లో భాగంగా నామినేషన్లకు రాష్ట్ర పర్యాటక డైరెక్టరేట్ లక్నో పేరును సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు సమర్పించింది. మార్చి 3, 2025న భారత ప్రభుత్వం లక్నోని దేశానికి సంబంధించి అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసింది. తాజాగా, అక్టోబర్ 31న లక్నోని యునెస్కో ఈ టైటిల్‌తో గౌరవించింది.
రాజ వంటశాలల నుంచి వీధి వ్యాపారుల వరకు లక్నో ఆహార సంస్కృతి చాలా కాలంగా సందర్శకులను ఆకర్షిస్తోందని పర్యాటక, సాంస్కృతిక ప్రధాన కార్యదర్శి అమృత్ అభిజత్ అన్నారు. యునెస్కో ట్యాగ్ ద్వారా సందర్శకుల సంఖ్య మరింతగా పెరుగుతుందని వెల్లడించారు. కాగా, 2024లో, దేశవిదేశాల నుంచి లక్నోని దాదాపు 82,74,154 మంది పర్యాటకులు సందర్శించారని ఆయన తెలిపారు. 2025 జూన్ నాటికి 70,20,492 మందికి పైగా సందర్శకులు వచ్చారని వెల్లడించారు. ఇది లక్నోలో ఆహారం, సాంస్కృతిక, పర్యాటక వృద్ధిని ఎలా కొనసాగిస్తున్నాయో స్పష్టం చేస్తుందని అమృత్ అభిజిత్ వివరించారు.
కాగా, లక్నోను యునెస్కో సృజనాత్మక గ్యాస్ట్రోనమీ నగరంగా గుర్తించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘లక్నో ఒక శక్తివంతమైన సంస్కృతికి పర్యాయపదం. దాని గొప్ప వంటకాల సంప్రదాయంతో యునెస్కో గుర్తింపు పొందడం హర్షణీయం. దేశ విదేశీ పర్యాటకులు లక్నోను సందర్శించి ఇక్కడి ప్రత్యేకతను అనుభవించాలి.’ అని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ట్వీట్‌పై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. లక్నోలో ప్రసిద్ధి చెందిన వంటకాలను, పాక పర్యాటక రంగాన్ని యునెస్కో గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Lucknow is synonymous with a vibrant culture, at the core of which is a great culinary culture. I am glad that UNESCO has recognised this aspect of Lucknow and I call upon people from around the world to visit Lucknow and discover its uniqueness. https://t.co/30wles8VyN
— Narendra Modi (@narendramodi) November 1, 2025


