DA hike for central employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కరువు భత్యం (డీఏ) 3% పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తాజా పెంపుతో బేసిక్ వేతనం 55% నుండి 58%కి చేరుకుంటుంది. పెంచిన డీఏ జూలై 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల డీఏ బకాయిలను అక్టోబర్ వేతనాలతో దీపావళి కంటే ముందే అందిస్తామని తెలిపారు.
రూ.10,083 కోట్ల భారం: కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోని 49.2 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.7 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. డీఏ పెంపు వల్ల కేంద్రంపై ఏటా అదనంగా రూ.10,083 కోట్ల భారం పడుతుందని అన్నారు. 8వ వేతన సంఘం సిఫారసులు 2026 జనవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఉదాహరణకు రూ. 60,000 ప్రాథమిక వేతనం ఉన్న ఉద్యోగికి పెంచిన డీఏతో ఇప్పుడు రూ. 34,800 వస్తుంది. ఇది ఇంతకు ముందు రూ. 33,000 ఉండేది.
డీఏ పెంచడానికి గల కారణం: ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి ఈ అలవెన్స్‌ను సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా ఈ పెంపు జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పింఛనుదారులకు కూడా వర్తిస్తుంది. పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య వారికి ఇది కొంత ఉపశమనం ఇస్తుందని ఆర్థిక నిపుణులు తెలిపారు.


