Maharashtra: దేశ వ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మహారాష్ట్రలో జరిగే దహీ హండీ ఉత్సవం కూడా జన్మాష్టమి వేడుకలకు సంబంధించినది. చిన్నప్పుడు శ్రీ కృష్ణుడు మట్టి కుండలని పగలగొట్టి వెన్నెను తినేవాడు. ఈ కథను ఆధారంగా చేసుకుని దహీ హండి ఉత్సవం నిర్వహిస్తారు. దీనిలో “గోవిందా” అనే యువకులు బృందంగా చేరి మానవ పిరమిడ్ నిర్మించి ఎత్తుగా వేలాడదీసిన మట్టి హండీ(కుండ)ను పగలగొడతారు.
మహారాష్ట్రలో దహీ హండి కేవలం పండుగే కాకుండా ఒక సామూహిక క్రీడా ఉత్సవంలా మారింది. ప్రభుత్వ భద్రతా చర్యలు, పాలసీలు దీనిని మరింత భద్రంగా మరియు ఉల్లాసంగా మార్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం గోవిందాలకు రూ.10 లక్షల వరకు ఉచిత బీమా అందిస్తుంది. ఈ ఉత్సవంలో భద్రత ప్రమాణాల దృష్ట్యా 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారిని అనుమతించదు. ఈ ఉత్సవాల నిర్వహణకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తారు.
Read more: https://teluguprabha.net/national-news/heavy-rains-in-maharashtra-waterlogging-in-airports/
ముంబయి, థానే, డోంబివిలి, వసై–విరార్, పుణే, నాశిక్, నాగ్పూర్, సతారా వంటి ప్రముఖ నగరాలలో ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాలకు మహారాష్ట్ర ప్రముఖులు హాజరు అవుతారు. ఈ సంవత్సరం థానే నగరంలో నిర్వహించిన ఉత్సవాలు రికార్డుని నెలకొల్పాయి. ఈ ఉత్సవాలలో కోన్కణ్ నగర్ రాజా గోవిందా బృందం 10 అంతస్థుల మానవ పిరమిడ్ నిర్మించింది. ఇప్పటివరకు జరిగిన దహీ హండి వేడుకల్లో ఇది ఒక విశేష ఘట్టంగా నిలిచింది.
మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఈ విజయాన్ని ప్రశంసిస్తూ, ఇది దహీ హండి పండుగలో “ప్రపంచ రికార్డు” అని ప్రకటించారు. ఈ గోవిందా బృందానికి రూ. 25 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ.. శివసేన ప్రథమ నాయకుడు బాలాసాహెబ్ ఠాక్రే, ఆనంద్ దిఘే గారి సంప్రదాయాలను కొనసాగిస్తూ దహీ హండి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
దహి హండి ఉత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న విషాదం నెలకొంటుంది. ఈ సంవత్సరం దహిసర్ ప్రాంతంలో జరిగిన వేడుకలలో విషాదం నెలకొంది. ఈ ఉత్సవాలలో భాగంగా పిరమిడ్ నిర్మాణానికి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనకు కారణమైన కమిటీని పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేసినందున పలు కేసులు నమోదు చేసారు. వేరువేరు ప్రాంతాలలో ఈ సంవత్సరం 30మందికి గాయాలు అయినట్టు సమాచారం.


