Deepika Padukone Mental Health Ambassador: గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు దీపికా పదుకొణె.. బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ టాప్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతున్న దీపికాను ఇటీవల పాన్ ఇండియా సినిమాలైన కల్కి-2, స్పిరిట్ నుంచి అనూహ్యంగా తప్పించడమే ఇందుకు కారణం. 8 గంటల పని విధానం, అధిక రెమ్యునరేషన్ కారణంగా దీపికాను తప్పించినట్లు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బాలీవుడ్ బ్యూటీకి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది.
మెంటల్ హెల్త్ అంబాసిడర్
ఈ రోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశపు తొలి ‘మానసిక ఆరోగ్య అంబాసిడర్‌గా’ దీపికా పదుకొణెను నియమించింది. 2015లో దీపికా ‘ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’(LLL)ను స్థాపించారు. తన వ్యక్తిగత డిప్రెషన్ అనుభవాన్ని బహిరంగంగా పంచుకున్న దీపికా.. ఈ ఫౌండేషన్‌ను స్థాపించి మానసిక ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా అవగాహన పెంచి ప్రజల్లో అపోహలను తగ్గించారు.
కీలక పాత్ర
ఈ క్రమంలో దీపికాను మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నియమించింది. దేశంలో మానసిక ఆరోగ్య సమస్యల గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడంలో దీపికా కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీపికా పదుకొణెతో ఈ భాగస్వామ్యం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువకావడానికి, మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతపై మరింత అవగాహన కల్పించడానికి దోహదపడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు.
గౌరవంగా భావిస్తున్నా
ఈ సందర్భంగా భారతదేశపు మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా పనిచేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు దీపికా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంలో దేశం బలమైన పురోగతిని సాధించిందని ప్రశంసించారు. దేశంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు, మరింత బలోపేతం చేసేందుకు మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని దీపికా అన్నారు. మానసిక ఆరోగ్య అవగాహన అనేది త్వరలోనే విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని ఆశాభావం వ్యక్తే చేశారు.
దీపికా పదుకొణె ‘లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ ద్వారా లక్షలాది మంది ప్రజలు అవగాహన పొందారు. దేశంలో మానసిక ఆరోగ్యంపై మాట్లాడే విధానాన్ని పూర్తిగా మార్చివేసిన ఆమె.. ఒకప్పుడు అపోహలు, నిశ్శబ్దంతో కూడిన సమస్యను బహిరంగ చర్చకు తీసుకొచ్చి, సహాయం కోరే వారి సంఖ్య పెరగడానికి దోహదపడ్డారు.


