Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేకు అరుదైన గౌరవం లభించింది. ఖతార్‌లో జరుగుతున్న ‘ఫిఫా వరల్డ్ కప్’ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ట్రోఫీ ఆవిష్కరించే అవకాశం దీపికాకు దక్కింది. ఈ ఘనత దక్కించుకున్న తొలి భారతీయురాలు దీపికానే.
ఆదివారం సాయంత్రం అర్జెంటినా-ఫ్రాన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ట్రోఫీని స్టేడియంలో ఆవిష్కరించారు. దీపికా పదుకొనేతోపాటు, స్పెయిన్ గోల్ కీపర్ అయిన ఐకర్ క్యాసిల్లాస్ చేతుల మీదుగా ట్రోఫీ ఆవిష్కరణ జరిగింది. ఇద్దరూ కలిసి ట్రోఫీని స్టేడియంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపిక ఈ ఘనత దక్కించుకునేందుకు ఆమె క్రేజ్ మాత్రమే కాకుండా మరో కారణం కూడా ఉంది. అదే ఈ ట్రోఫీ కేస్ రూపొందించిన లూయిస్ విట్టన్ అనే లగ్జరీ బ్రాండ్ సంస్థ. ఈ బ్రాండ్‌కు దీపికా పదుకొనే అంబాసిడర్‌గా కొనసాగుతోంది.
మరోవైపు ఇప్పటివరకు ఈ ట్రోఫీ ఆవిష్కరించే అవకాశం నటులెవరికీ రాలేదని తెలుస్తోంది. దీంతో దీపిక ఈ ఘనత దక్కించుకున్న తొలి నటిగా నిలిచింది. దీనిపై ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.