Uttarakhand Cloudburst: ఉత్తరాఖాండ్‌లోని డెహ్రాడూన్‌లో కుండపోత వర్షం కురుస్తుంది. సహస్రధారాలో సోమవారం అర్థరాత్రి కురిసిన కుండపోత వర్షాల (క్లౌడ్ బరస్ట్) కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీనితో తామ్సా నది ఉప్పొంగి ప్రవహించడంతో ప్రసిద్ధ తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం పూర్తిగా నీట మునిగింది. అయితే ఆలయ గర్భగుడిలోని శివలింగం మాత్రం సురక్షితంగా ఉందని ఆలయ పూజారులు వెల్లడించారు.
భారీ వర్షాల ప్రభావం: సోమవారం అర్థరాత్రి తర్వాత సంభవించిన వరదలతో పలు రహదారులు వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల హోటళ్లు సైతం పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. డెహ్రాడూన్, తీహ్రి గఢ్వాల్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది.
Also Read:https://teluguprabha.net/telangana-news/moderate-rains-forecast-in-telangana/
సహాయక చర్యలు: వర్షాల కారణంగా కొందరు గల్లంతైనట్లు సమాచారం. అయితే దీనిపై పూర్తి వివరాలను అధికారులు ధ్రువీకరించలేదు. వరదల కారణంగా రిషికేశ్‌లోని చంద్రభాగ నది సైతం ఉప్పొంగి ప్రవహించడంతో హైవేపైకి వరదనీరు చేరింది. నదిలో చిక్కుకున్న ముగ్గురిని ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం రక్షించింది. ప్రస్తుతం వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. నీటి మట్టాలు పెరిగినందున నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు ప్రజలను హెచ్చరించారు.
ముఖ్యమంత్రి పర్యవేక్షణ: ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. భారీ వర్షాల వల్ల కలిగిన నష్టంపై జిల్లా యంత్రాంగం, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ పరిస్థితిని తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని అన్నారు. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
క్లౌడ్ బరస్ట్: గంటలో 10 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దానిని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఇది చాలా తీవ్రమైన వరదలకు.. కొండచరియలు విరిగిపడటానికి దారితీస్తుంది. ఫలితంగా ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించే అవకాశం ఉంది. సాధారణంగా హిమాలయ పర్వత శ్రేణులలో ఈ తరహా క్లౌడ్ బరస్ట్ ఘటనలు తరచుగా సంభవిస్తాయి.


