Delhi Teen 275 Kg Bariatric Surgery : తీవ్రమైన ఊబకాయంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న 16 ఏళ్ల ఢిల్లీ బాలుడికి సర్ గంగారామ్ ఆసుపత్రి వైద్యులు అత్యంత సంక్లిష్టమైన లాపరోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ (బేరియాట్రిక్ సర్జరీ)ని విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం కేవలం రెండు నెలల్లోనే బాలుడి బరువు దాదాపు 50 కిలోలు తగ్గింది. తీవ్రమైన ఊబకాయం కారణంగా బాలుడి బరువు 275 కిలోలకు, బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) దాదాపు 100కు చేరింది. సాధారణ కారులో కూర్చోవడం కూడా సాధ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు మ్యాటడోర్ వాహనంలో అతడిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చేరే సమయానికి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, తీవ్రమైన చర్మ ఇన్ఫెక్షన్లతో బాలుడు బాధపడుతున్నాడు.
శస్త్రచికిత్సకు ముందు దాదాపు రెండు వారాల పాటు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ)లో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. కేసు అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో పీడియాట్రిక్ క్రిటికల్ కేర్, బేరియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, అనస్థీషియా తదితర విభాగాలకు చెందిన సుమారు 20 మంది వైద్య నిపుణులు సమగ్రంగా సమీక్షించారు. అనంతరం కుటుంబ సభ్యుల అనుమతితో శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించారు.
డాక్టర్ దక్ష్ సేథి, డాక్టర్ సుధీర్ కల్హాన్, డాక్టర్ ముకుంద్ ఖేతాన్, డాక్టర్ సువిరాజ్ జాన్ తదితరులతో కూడిన వైద్య బృందం లాపరోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీని విజయవంతంగా పూర్తి చేసింది. శస్త్రచికిత్స అనంతరం బాలుడు వేగంగా కోలుకున్నాడు. దీంతో కేవలం మూడు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. శస్త్రచికిత్సకు ముందు 275 కిలోలున్న బాలుడి బరువు రెండు నెలల్లో 223 కిలోలకు తగ్గింది. అంటే 52 కిలోల బరువు తగ్గాడు. బరువు తగ్గించడమే కాకుండా బాలుడి జీవన నాణ్యతను మెరుగుపరచడం, భవిష్యత్తులో గుండె, శ్వాసకోశ సమస్యల ముప్పును తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలుడు వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక వెయిట్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు.

