ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. 70 ఎమ్మెల్యే సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఈనెల 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కించి, ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5.00 గంటలకు ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. దీంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు.. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోనేందుకు ఓటర్లను సమాయత్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉండనుంది.
దీంతో ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈసారి ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడోసారి ఢిల్లీలో పాగా వేస్తుందా.. లేక జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంటాయా.. ఢిల్లీ ఓటరు ఎవరివైపు మొగ్గు చూపుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఏబీపీ న్యూస్ పేరిట ఒపీనియన్ పోల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. దీని ప్రకారం బీజేపీ 47, ఆప్ 17, కాంగ్రెస్ 6 స్థానాలు గెలుస్తుందని తెలిపింది. అయితే వైరల్ అవుతున్న గ్రాఫిక్స్ నిజం కాదని తెలుస్తోంది. తాము ఎలాంటి ఒపీనియన్ పోల్ చేయలేదని ఏబీపీ తెలిపింది. ఇదిలా ఉంటే హ్యాట్రిక్ కొట్టాలని ఆప్.. మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, 23 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీలు తీవ్రంగా శ్రమించాయి.